ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టి… పేదలకు ప్రపంచస్థాయి విద్యనందిస్తూంటే.. అడ్డుకుంటున్నారంటూ… వైసీపీ నేతలు.. ఏ మాత్రం మొహమాటం లేకుండా.. పేద విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేసేస్తున్నారు. ఇప్పుడు వారి నిజాయితీ నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది. వచ్చే ఏడాది నుంచి వైసీపీ నేతలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో చేర్పించి.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.
అధికార పార్టీ నేతల పిల్లలు, మనవళ్లను ప్రభుత్వ బడుల్లో చేర్పించే ధైర్యం ఉందా..?
మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ… వైసీపీ నేతలు.. తెలుగు మీడియం ఉంచమని డిమాండ్ చేసే వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇప్పుడు.. ఇదే క్వశ్చన్ రివర్స్ లో వస్తోంది. ఇప్పుడు.. మీ పిల్లలు.. మీ మనవళ్లు.. మీ చుట్టాలు.. పక్కాలు ఎక్కడ చదువుతున్నారు..?. వారందర్నీ… వచ్చే విద్యాసంవత్సరం నుంచి.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువుల్లోనే చేర్పించగలరా..?. పేదలకు ప్రపంచ స్థాయి విద్యనందిస్తామని.. రోబోటిక్స్ రంగంలోకి రాణించడానికి ఇంగ్లిష్ అవసరమని ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. ఆయన బంధువర్గంలోని వారందర్నీ.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చేర్పించాలని ఆదేశాలివ్వగలరా..? కనీసం ఆలోచన చేయగలరా..?
ప్రభుత్వ విద్యను సంస్కరించడంలో అతి పెద్ద ముందడుగు అదే..!
ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ద్వారానే… పేద విద్యార్థులకు.. నాణ్యమైన విద్య అందకుండా పోవడం లేదు. అసలు విద్యా ప్రమాణాలే నీరసం. టీచర్లు తమ విధుల్ని మనసు పెట్టి నిర్వహించడాన్ని ఎప్పుడో మానేశారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేదు. అందుకే పేద పిల్లల విద్యా ప్రమాణాలు పడిపోయాయి. ప్రైవేటు స్కూల్స్ ఇబ్బడిమబ్బడిగా పెరిగిపోయాయి. కూలీ పనులు చేసుకునేవారు కూడా.. విద్యను పిల్లల కోసం కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ మౌలిక సమస్యను మర్చిపోయి.. ఇంగ్లిష్ మీడియం అంటూ.. వాదన ప్రారంభించింది..సర్కార్. ఈ మౌలిక సమస్యను అధిగమించాలంటే… రాజకీయ నేతల పిల్లలు.. అఖిలభారత సర్వీసు అధికారులు మాత్రమే కాదు.. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి.. తమ పిల్లలను.. ప్రభుత్వ స్కూల్లోనే చదివేలా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడైనా తమ పిల్లల భవిష్యత్ కోసమైనా… అధికార పెద్దలు స్కూళ్లపై దృష్టి పెడతారు.
ప్రభుత్వ బడుల్లోనే చదవాలనే చట్టం తెచ్చే ధైర్యం ఉందా..?
ఎప్పుడో.. ఓ కలెక్టర్ కూతురో..భార్యో.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుంటే న్యూస్ అవుతుంది. కానీ ఆ ఒక్క ప్రసవం కోసం.. లక్షలు ప్రజాధనం ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తారు. మిగతా రోగులకు ఆ ఏర్పాట్లు ఉండవు. అది వైద్యం కాబట్టి.. సరే.. విద్యలో అయితే.. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం తమ పిల్లల్ని చేర్పించే ఆలోచన కూడా చేయరు. అంత ఎందుకు.. చివరికి ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా.. ప్రభుత్వ స్కూల్లోనే.. తమ పిల్లలను చేర్చరు. వీరెవరికీ.. వ్యవస్థపై నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు.. రాజకీయ నేతలు.. అధికారులు.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలంతా.. ప్రభుత్వ స్కూళ్లలోనే చదివేలా చట్టం చేయాలి. అప్పుడే.. ఆయనకు చిత్తశుద్ధి ఉన్నట్లుగా ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది.
మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. సరైన శిక్షణ పొందని ఉపాధ్యాయులను పెట్టి.. ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తే.. పేద విద్యార్థులే అన్యాయమైపోతారు. అలా జరగకుండా.. ఉండాలంటే… నేతలు, ఉద్యోగుల పిల్లలను వాటిల్లో చేర్పించాలి. అప్పుడే.. ప్రమాణాలు మెరుగుపడతాయి. ప్రభుత్వం ఈ సవాల్‌ను స్వీకరించగలదా..?