భారతదేశ మ్యాప్‌లో.. అమరావతిని గుర్తించకుండా.. కొద్ది రోజుల కిందట.. కేంద్ర ప్రభుత్వం మ్యాప్ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తించారు కానీ.. ఏపీకి ఆ చాన్స్ దొరకలేదు. ఈ విషయాన్ని గల్లా జయదేవ్ పార్లమెంట్లో లేవనెత్తారు. ఇలా చేయడం అమరావతికి శంఖుస్థాపన చేసిన మోడీని అవమానించడమేనని.. సెంటిమెంట్‌తో కొట్టారు. ఆ సమయంలో లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు చూసిన వారెవరికైనా… వైసీపీ ఎంపీలు ఎవరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదని తెలిసిపోతుంది. పోనీ లిఖిత పూర్వకంగా అయినా.. ఈ విషయంపై.. లోక్‌సభ స్పీకర్‌కు.. తమ అభిప్రాయం పంపారా.. అంటే అదీ లేదు. రాజధానిగా అమరావతిపై కానీ… ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించాలన్నదానిపై కానీ.. ఇంత వరకూ వైసీపీ ఎంపీలు.. ఒక్కరు కూడా.. ఎలాంటి ప్రశ్న కానీ.. అనుబంధ ప్రశ్న కానీ వేయలేదు. వేరే ఏ చర్చలోనూ.. ప్రస్తావించలేదు.
కానీ.. గల్లా జయదేవ్ పార్లమెంట్లో చేసిన ప్రస్తావనతో… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. పొలిటికల్ మ్యాప్‌లో అమరావతిని గుర్తించి కొత్త మ్యాప్ విడుదల చేసింది. ఈ సందర్భంగా సాక్షి పత్రికలో.. మిధున్ రెడ్డి లోక్ సభలో ప్రస్తావించారని.. దానికి కిషన్ రెడ్డి స్పందించారని… కనిపించీ కనిపించకుండా.. రాసుకుని… క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇదే చాలా మందిని ఆశ్చర్యపరిచింది.. ఓ వైపు సోషల్ మీడియాలో.. గల్లా జయదేవ్‌కు ప్రశంసలు చెబుతూ.. పోస్టులు వెల్లువెత్తుతూంటే.. కనీసం అమరావతి మాట మాట్లాడటానికి అంగీకరించని.. వైసీపీ పేపర్.. ఆ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడటం లేదు.
ఒక్క అమరావతి అంశం మాత్రమే కాదు.. పార్లమెంట్లో వైసీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలు చాలా వరకూ.. ఏపీకి సంబంధం లేనివే ఉంటాయి. డ్రోన్ ఎటాక్స్ నుంచి రక్షణ కోసం ఏం చేస్తున్నారు..? గంగా ప్రక్షాళనకు తీసుకుంటున్న చర్యలేంటి..? ఇలాంటి అంశాలపై ఎంపీలు ప్రశ్నలు వేస్తున్నారు. ఏపీకి సంబంధించి.. వేస్తున్న ప్రశ్నలు.. రాబడుతున్న సమాధానాలు తక్కువ. అయినా… మీడియాలో హైలెట్ అయ్యే విషయాల్లో.. తమను తాము హైలెట్ చేసుకుంటున్నారు.