తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. బీజేపీ అగ్రనాయకత్వంతో మళ్లీ టచ్‌లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయాలకు అడగకపోయినా మద్దతు ప్రకటిస్తున్నారు. అమరావతి ని భారతదేశ మ్యాప్‌లో గుర్తిస్తూ.. కేంద్రం ప్రకటన చేయడంతో.. అందరూ .. ఈ అంశాన్ని లేవనెత్తిన గల్లా జయదేవ్ ను అభినందించారు. చంద్రబాబు గల్లా జయదేవ్ ను విడిగా అభినందించారు.. కానీ.. ఇలా అడగగానే.. మ్యాప్‌లో అమరావతిని గుర్తించినందుకు.. నరేంద్రమోడీకి.. అమిత్ షాకు.. చంద్రబాబు కృతజ్ఞతలు చెబుతూ.. పోస్టులు పెట్టారు.
టీడీపీ ఘోర పరాజయం పాలయ్యాక.. చంద్రబాబును, అమిత్ షాను చంద్రబాబు పొగడటం.. ఇదే మొదటి సారి కాదు. ఆర్టికల్ 370 సహా.. పలు కీలక నిర్ణయాలకు.. చంద్రబాబు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. కొన్ని సందర్భాల్లో లేఖలు కూడా రాశారు. నిజానికి ఇలా స్పందించాల్సిన అవసరం లేదు . కానీ బీజేపీతో మళ్లీ దగ్గరి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి.. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇదని చెప్పుకోవచ్చు. టీడీపీకి మిగిలిన ముగ్గురు లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కేంద్రాన్ని నొప్పింపకుండా… తాను బాధపడకుండా.. వ్యవహారాలను చక్క బెడుతున్నారు. ప్రభుత్వానికి దాదాపుగా ప్రతీ అంశంలోనూ మద్దతు పలుకుతున్నారు.
2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. 2019లో కటిఫ్ చెప్పేసింది. కేంద్రంలో హంగ్ వస్తే చక్రం తిప్పవచ్చని చంద్రబాబు ఆశపడ్డారు. కానీ.. మొత్తానికే సీటు జారిపోయింది. ఇప్పుడు మళ్లీ.. పార్టీని కాపాడుకోవడానికి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కావాల్సి వస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసం.. పోరాడాలన్న… కట్టుబాట్లు ఇప్పుడు.. చంద్రబాబుకు లేవు. 22 మంది ఎంపీలున్న వైసీపీ.. అదీ కూడా అధికార పార్టీ అయినప్పటికీ.. ఏమీ మాట్లాడకపోతూండటంతో.. చంద్రబాబును కూడా ప్రశ్నించేవారు లేరు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని… మోడీ, షాలతో మళ్లీ పరిచయాలు పెంచుకునేందుకు తాపత్రయ పడుతున్నారు చంద్రబాబు.