ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడంపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడానికి ఆగమేఘాల మీద కసరత్తు చేస్తోంది. దేవదాసు సినిమాలో ‘మేఘాల మీద సాగాలి…అనురాగాల రాశిని చూడాలి’ అనే పాట మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం పరుగులు తీస్తోంది. సీఎం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి సక్సెస్ చేయగలడా? అనే సందేహం చాలామందిలో ఉంది. కొందరు దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఒకటో రెండో జిల్లాలో ప్రవేశపెట్టి సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లు పరిశీలించాక నెమ్మెదిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని సర్కారుకు సలహా ఇచ్చారు. కాని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయడానికి సర్కారు సిద్ధమైంది.
మొదట ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఎందుకైనా మంచిదని దాన్ని ఆరో తరగతి వరకు పరిమితం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన కసరత్తు మొదలైంది. తరతరాలుగా చాలా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటో తెలుసు కదా. వసతులు ఉండవు. టీచర్ల కొరత రాజ్యమేలుతుంటుంది. కనీసం టాయిలెట్లు కూడా ఉండవు. పాఠ్యపుస్తకాల సంగతి సరేసరి. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందవు. అంటే ఆరు నెలల (హాఫ్ఇయర్లీ ఎగ్జామ్స్) పరీక్షల నాటికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి దాదాపు ప్రతి విద్యా సంవత్సరం ఎదురవుతూనే ఉంటుంది. ఉమ్మడి ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉండేది.
మరి ఈ పరిస్థితి జగన్ పాలనలో ఉండదా? ఎందుకు ఇలా అనుకోవల్సి వస్తోందంటే..వచ్చే ఏడాది జనవరి ఆఖరునాటికి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం పుస్తకాలు సిద్ధమైపోతాయని అధికార యంత్రాంగం చెబుతోంది. అంటే రెండు నెలల్లో సిద్ధమవుతాయన్నమాట. నిజంగా అదే జరిగితే అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇదే వేగంతో తెలుగు మీడియం (7 నుంచి 10 వరకు) తయారుచేయగలరా? ఇంగ్లిషు మీడియం మోజులో వాటిపట్ల నిర్లక్ష్యం వహిస్తారా? ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం గొప్ప కాదు. ఆ మీడియంలో బోధించే సమర్థులైన ఉపాధ్యాయులు కావాలి. ఇప్పుడు ఇంగ్లిషు ఒక సబ్జెక్టు కాదు. మీడియమే ఇంగ్లిషు. కాబట్టి అన్ని సబ్జెక్టులు ఇంగ్లిషులో బోధించే టీచర్లు కావాలి.
ఏపీలో 13 జిల్లాలున్న సంగతి తెలుసు కదా. అధికారులు ఒక్కో జిల్లా నుంచి 10 మంది టీచర్లను ఎంపిక చేశారు. వీరు ఇంగ్లిషులో నిష్ణాతులు. వీళ్లను కీ రిసోర్స్ పర్సన్స్ అంటారు. వీరికి డిసెంబరు 2 నుంచి శిక్షణ ఇస్తారు. శిక్షణ తరువాత వీరు వీరి జిల్లాలకు వెళ్లి అక్కడ వివిధ మండలాల్లో టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఒక్కో రిసోర్స్ పర్సన్‌కు నాలుగు మండలాలు అప్పగిస్తారు. రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ డిసెంబరు 31తో ముగుస్తుంది. మండలాల్లోని టీచర్లకు జనవరి నుంచి మార్చి వరకు శిక్షణ ఇస్తారు. ఎండాకాలం సెలవుల్లోనూ ఇంగ్లిషు మీడియంలో బోధించబోయే టీచర్లకు మరోసారి శిక్షణ ఇస్తారు. ఇంగ్లిషు మీడియం వ్యవహారాలు చూడటానికి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వరకు ఇంగ్లిషు మీడియంలో చదివే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ రెడ్డి కాంతారావు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ, జడ్పీపీ పాఠశాలలు 94,889 ఉన్నాయి. వీటిల్లో టీచర్లు తెలుగు మీడియంలో డిగ్రీ చేసినవారు. అయినా ఏమీ పర్వాలేదని, వీరు ఇంగ్లిషులో బోధించేలా తీర్చిదిద్దుతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్లానింగ్ అంతా థియరీ అనుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రాక్టికల్స్ మొదలవుతాయి. అప్పుడుగాని ఇంగ్లిషు మీడియం ఎంతవరకు విజయవంతమవుతుందో తెలుస్తుంది.