పరిపూర్ణానంద స్వామి… ఇన్నాళ్లూ ధర్మం కోసం పోరాటం చేశాను, ఇకపై దేశం కోసం పోరాటం చేస్తా అంటూ భాజపాలో చేరారు. గత ఏడాది దాదాపు ఇదే సమయంలో కొంత హడావుడి చేశారు. తెలంగాణ భాజపాలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు, ఉత్తరాది తరహానే ఇక్కడ కూడా స్వామీజీల ప్రయోగాన్ని ఆ పార్టీ ఈయనతో ప్రారంభించింది అనుకున్నాం. ఎప్పటిదో ఓ పాత ఫిర్యాదు వెలికిదీసి మరీ పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేశారు పోలీసులు. ఆ పరిణామాల నేపథ్యంలో స్వామీజీని ఎన్నికల్లో పోటీకి దించుతారనే అభిప్రాయమూ కలిగింది. ఆయన కూడా భాజపాకి బాగానే ప్రచారం చేశారు. అయితే, ఎన్నికలు అయిపోయాక ఇంతవరకూ భాజపా తరఫున మాట్లాడింది లేదు. ఇక్కడి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకున్నదీ లేదు. కానీ, ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతా అంటున్నారు.
ఎన్నికల తరువాత ఆయన ఎందుకు మౌనముద్ర దాల్చారంటే… తెలంగాణ భాజపా నేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో! సరే, ఏదో ఒక రోజు తనని పిలుస్తారని ఇన్నాళ్లూ ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయనే యాక్టివ్ అయి… ఈ మధ్యనే పార్టీ జాతీయ నాయకత్వానికి ఒక ఫిర్యాదు చేసినట్టు సమాచారం! తెలంగాణ నేతలు తనని పట్టించుకోవడం లేదంటూ చెప్పేసరికి… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆదివారం నాడు హైదరాబాద్ లో ఉన్న స్వామీజీని కిషన్ రెడ్డి కలుసుకున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇస్తామంటూ పరిపూర్ణానందకు భరోసా కల్పించినట్టు సమాచారం. అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే జరిగిందీ, దీన్లో రాజకీయ కోణం లేదంటూ ఆ తరువాత కిషన్ రెడ్డి మీడియాతో చెప్పారు.
ఎన్నికలకు ముందు పార్టీకి మాట సాయం చేసిన పరిపూర్ణానంద… తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? స్వామీజీ అందుబాటులో ఉన్నా కూడా టి. భాజపా ఆయన సేవల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది..? ఈ పరిస్థితి ఎందుకు అంటే… ఉత్తరాదిలో మాదిరిగా స్వామీజీల ప్రయోగం ఇక్కడ భాజపాకి వర్కౌట్ కావడం లేదు. ప్రయోగాత్మకంగా పూర్ణానందను రంగంలోకి దించినా, ఎన్నికల్లో ఆయన ప్రభావమంటూ ఏమీ లేదు. సమీప భవిష్యత్తులో ఉంటుందా… అదీ అనుమానమే. తెలంగాణలో హిందుత్వ లాంటి అంశాలు పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి ఉన్నప్పుడు భాజపా ఏం చేస్తుందీ.. అదే చేసింది..! తాను అలక వీడాను అన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తున్న స్వామీజీ… పార్టీ కోసం ఏదో ఒకటి చేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.