అఘామేఘాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన.. మహారాష్ట్ర బీజేపీ నేత ఫడ్నవీస్.. అంతే వేగంగా బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం పదిన్నరకు.. ఈ అంశంపై.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇరవై నాలుగు గంటల్లోగా.. ప్రభుత్వాన్ని బలం నిరూపించుకునేలా ఆదేశాలివ్వాలని శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి తరపున.. కపిల్ సిబల్ … ధర్మాసనం ముందు వాదించారు. మూడు పార్టీలకు కలిపి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అఫిడవిట్లను సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే.. వాటిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బలపరీక్ష జరగాల్సింది అసెంబ్లీలోనే అని స్పష్టం చేసింది.
ఈ విషయంలో.. ఆదివారం అత్యవసరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అసలు రాష్ట్రపతి పాలన ఎత్తివేత, ప్రభుత్వ ఏర్పాటుకు … ఫడ్నవీస్ సంసిద్ధత తెలుపుతూ… పంపిన లేఖలు.. ఎన్సీపీ మద్దతిస్తమన్నట్లుగా చెప్పిన రికార్డులను.. సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు.. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా మద్దతిస్తున్నారంటూ.. అజిత్ పవార్ గవర్నర్ కు సమర్పించిన ఓ లేఖను.. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ సమర్పించారు. దాని మీద.. ఇరవై రెండో తేదీ ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు జరిగిన పరిణామాలను వివరించారు. వాటి ప్రకారమే.. గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో గవర్నర్ ను తప్పు పట్టాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీలు విధానాలు మార్చుకుంటే.. గవర్నర్ మాత్రం ఏం చేస్తారని.. అటార్నీ జనరల్ వాదించారు. అయితే.. ఆ లేఖలో ఎక్కడా బీజేపీకి మద్దతిస్తున్నట్లు లేదని.. కూటమి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సుప్రీంకోర్టు.. బలపరీక్ష విషయంపై.. నిర్ణయం ప్రకటించకుండా..రిజర్వ్ చేయడం.. ఓ రకంగా ఫడ్నవీస్‌కు.. రిలీఫ్ లాంటిదే. ఆయన… ముఖ్యమంత్రిగా బలం నిరూపించుకోకుండానే.. బాధ్యతలు స్వీకరించేశారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా…ఆయనకు కొంత సమయం లభిస్తుంది. దీంతో.. ఇప్పటికే.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల ఆకర్ష్ ప్రయత్నాలు మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర అంశంపై పార్లమెంట్‌లోనూ గందరగోళం ఏర్పడింది.