చివరి మెట్టు కూడా దిగేసి సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు ఆర్టీసీ జేయేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. మంగళవారం ఉదయమే ఉద్యోగులందరూ వారివారి డిపోలకు వెళ్లి, వెంటనే విధుల్లోకి చేరాలనీ, వారిని యాజమాన్యం విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆయన కోరారు. హక్కుల కోసం ఇన్నాళ్లూ శాంతియుతంగా సమ్మె చేశామనీ, నైతిక విజయం మనదే అంటూ ఆయన ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించామన్నారు. ఇలా… 52 రోజుల సుదీర్ఘ ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్ పడింది.
అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడుంది..! కార్మికులను విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదనీ, వారిష్టం వచ్చినప్పుడు విధులు బహిష్కరిస్తామనీ, నచ్చినప్పుడు వచ్చేస్తామని ప్రకటనలు చేయడం హాస్యాస్పదం అన్నారు ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. పండుగల సమయంలో అనాలోచితంగా సమ్మెకి వెళ్లి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారన్నారు. ఇప్పటికిప్పుడు విధుల్లోకి వచ్చేస్తామంటే చేర్చుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఇప్పటికే యూనియన్ల నాయకులు మాటలు విని కార్మికులు చాలా నష్టపోయారనీ, ఇంకా వారి మాటలు వింటూ నష్టపోవద్దన్నారు. హైకోర్టు సూచనల ప్రకారం ఆర్టీసీకి సంబంధించిన అంశం లేబర్ కోర్టులో పెండింగ్ ఉందనీ, అక్కడి నుంచి తుది నిర్ణయం వచ్చే వరకూ కార్మికులు సంయమనం పాటించాలని ఆర్టీసీ ఎండీ తేల్చి చెప్పేశారు.
సమ్మె అంశం లేబర్ కోర్టులో పెండింగ్ ఉందనీ తెలిసీ, కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని చెప్పిన జేయేసీ… ఉన్నట్టుండి ఈ విమరణ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించినట్టు..? దీని వెనక వారి వ్యూహం ఏంటంటే… గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళ్లబోతోందో సీఎం వివరించినట్టు సమాచారం. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవాలంటే ఉద్యోగాల్లో చేరడమే మంచి నిర్ణయమౌతుందనీ, సెల్ఫ్ డిస్మిస్ అని ముఖ్యమంత్రి ప్రకటించేసిన గత నిర్ణయాన్ని కూడా అడ్డుకున్నట్టు అవుతుందనీ అనే నిర్ణయంతోనే సమ్మెను అర్ధంతరంగా ముగించేశారని భావించాలి.
మంగళవారం ఆర్టీసీ డిపోల దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను విధులకు రావొద్దంటూ ఆర్టీసీ జేయేసీ పిలుపునిచ్చింది. మేం డ్యూటీలకు వచ్చేస్తున్నాం కాబట్టి, ఇక మీరు రాకూడదని తేల్చి చెప్పింది. అయితే… సమ్మె చేస్తున్న కార్మికులు విధులకు వచ్చినా చేర్చుకోమని యాజమానం చెప్పింది. ఆర్టీసీ ఎండీ వద్దన్నారు కదా అని కార్మికులు విధులకు వెళ్లకుండా ఆగరు కదా! కాబట్టి రాష్ట్రంలో అన్ని డిపోల వద్దా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశమైతే కనిపిస్తోంది.