తెలంగాణలో ఇక సమ్మె చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఆర్‌టీసీ కార్మికులు కనీసం ఒక్క డిమాండ్ కూడా సాధించకుండా నిస్సహాయంగా సమ్మె విరమించిన నేపథ్యంలో ఎవరైనా సరే ఈ ప్రశ్న వేసుకుంటారు. కార్మికులు కనీస ఒక్క డిమాండ్ కూడా సాధించకుండా సమ్మె విరమించడం చూసిన వారెవరైనా కేసీఆర్ పాలనలో సమ్మె చేయడానికి సాహసిస్తారా అనే అనుమానం కలుగుతోంది. నిజంగా ఆర్‌టీసీ కార్మికులది అత్యంత దయనీయమైన పరిస్థితని చెప్పుకోవచ్చు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా ఆర్‌టీసీ కార్మికులు 42 రోజులు సమ్మె చేశారు. అదే కేసీఆర్ పాలనలో 52 రోజులపాటు సమ్మె చేసి రికార్డు సృష్టించారు.
అప్పటి సమ్మె కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, ఇప్పటి సమ్మె వల్ల ఆర్‌టీసీ కార్మికులు డిమాండ్లు సాధించుకోకపోగా ఇంటికి వెళ్లిపోవల్సిన పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ల సాధన కోసం పట్టువదలని విక్రమార్కుల్లా సమ్మె చేసిన కార్మికులు, చివరకు నిస్సహాయంగా ‘విధుల్లో చేరుతాం మహాప్రభో కనికరించండి’ అని అభ్యర్థిస్తూ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆర్‌టీసీ చరిత్రలో ఇప్పటివరకు జరిగి ఉండదు. కేసీఆర్ మొండితనం ముందు ఆర్‌టీసీ కార్మికుల పట్టుదల వీగిపోయింది. రాజు, మొండి ఒక్కడే కావడంతో దాదాపు యాభైవేల మంది ఐకమత్యం, పట్టుదల ఎందుకూ పనికిరాకుండాపోయింది. కార్మికులకు మద్దతుగా ప్రతిపక్షాలు ఏదో హడావిడి చేసినా కేసీఆర్‌ను భయపెట్టే శక్తి వాటికి లేదని తేలిపోయింది.
చివరకు హైకోర్టు కూడా కార్మికులకు ఏమీ చేయలేకపోయింది. అధికారులకు అక్షింతలు వేసినా, కేసీఆర్‌కు రాజధర్మం బోధించినా, సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమని చెప్పినా తాను ఏమీ చేయలేనని, పరిమితులు ఉన్నాయంటూ నిస్సహాయత ప్రకటించింది. కార్మికులతో చర్చలు జరపాల్సిందేనని కరాఖండీగా ఆదేశించలేమని కూడా చెప్పింది. చివరకు రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వానికి మద్దతు పలికినట్లయింది. హైకోర్టే సర్కారుకు వ్యతిరేకంగా చెప్పనప్పుడు లేబర్ కోర్టు చెబుతుందా? ఇది ఇల్లీగల్ సమ్మె అన్న కేసీఆర్ వాదననే సమర్థించవచ్చని అంచనా. కార్మికులు సమ్మె విరమించినా లేబర్ కోర్టు తీర్పు వచ్చేంతవరకు వారు చేసేది ఏమీ లేదు. ‘మీరు సమ్మె విరమించినా డ్యూటీల్లోకి తీసుకోం’ అని కేసీఆర్ ఆర్‌టీసీ ఎండీతో చెప్పించాడు.
కార్మికులు, ప్రతిపక్షాలు గవర్నర్ మీద పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరలేదు. ‘ఆర్‌టీసీలో మాకు వాటా ఉంది’ అంటూ కేంద్రం హూంకరించినా ఏమీ కాలేదు. ‘అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ (ఆరుగురి కారణంగా కర్ణుడు మరణించాడు) అన్నట్లుగా ఆర్‌టీసీ కార్మికుల పరిస్థితి తయారైంది. కేసీఆర్ మొండితనాన్ని హుజూర్ నగర్ ఎప ఎన్నిక విజయం మరింత రెట్టింపు చేసింది. ఆ ఎన్నికలో చిత్తుగా ఓడిపోయిన ప్రతిపక్షాలు కార్మికులకు ఎంత మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరామ్‌లాంటివారి హవా ఇప్పుడు ఆగిపోయింది.
రాష్ట్ర విభజన జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ‘సమ్మెలు లేని తెలంగాణను నిర్మించుకుందాం’ అన్నాడు. అంటే ఉద్యోగులుగాని, కార్మికులుగాని సమ్మెలు చేసి డిమాండ్లు సాధించుకునే పరిస్థితి రాకుండా వారి సమస్యలు గుర్తించి తానే పరిష్కరిస్తానని చెప్పాడన్నమాట. కాని ఇప్పుడది రివర్స్ అయింది. సమ్మెలు లేని తెలంగాణ అంటే ‘సమ్మెలు చేయడానికి భయపడే తెలంగాణ’ అని అర్థం. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెను మిగిలిన శాఖల ఉద్యోగులు గుణపాఠంగా తీసుకోవాలని కేసీఆర్ భావిస్తుండవచ్చు. ‘ఎవరైనా సమ్మె చేశారో ఖబడ్దార్’ అన్నట్లుగా ఉంది ఆయన వైఖరి. ఆర్‌టీసీ సమ్మె తెలంగాణ చరిత్రలో రికార్డు బ్రేక్. 52 రోజులు సమ్మె చేసినా ఒక్క డిమాండూ సాధించుకోలేకపోవడం, సమ్మె విరమించినా వారిని సర్కారు విధుల్లో చేర్చుకోకపోవడం కూడా రికార్డే.