అమరావతిలో నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరవై ఎనిమిదో తేదీన రాజధానిలో చంద్రబాబు పర్యటన ప్రకటన తర్వాత హడావుడిగా జరిగిన సీఆర్డీఏ రివ్యూలో.. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా… ప్రభుత్వం మీడియాకు సమాచారం ఇచ్చింది. సీఆర్డీఏలో ప్రాధాన్యతల పరంగా నిర్మాణ పనులు సాగాలని.. సూచించినట్లు … అనవసర ఖర్చులు వద్దు, ఆర్భాటాలకు పోవద్దని ఆదేశించినట్లుగా సీఆర్డీఏ చెప్పుకొచ్చింది. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..దశలవారీగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగినట్టుగా ఉండాలని సూచించారు. భూములిచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను..అభివృద్ధి చేసి అప్పగించాలని ఆదేశించినట్లుగా.. సీఆర్డీఏ అధికారులు చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం చంద్రబాబు ప్లాన్ చేసిన రేంజ్లో కాకపోయినా… ఇప్పటికి పనులు ప్రారంభమైన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లలు చెల్లించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మొత్తం 13 పనులను ప్రాధమికంగా ప్రభుత్వం గుర్తించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్ మెంట్లు నిర్మాణాలు ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. సెక్రటేరియట్, హెచ్ వోడి టవర్ల విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం ఉంది.
రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఎక్కవగా ఉందని ప్రభుత్వం చెబుతుంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్ధిక సంస్థలు వెనుకకు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని, హై కోర్టును కూడా తరలిస్తున్నారని ప్రచారం కోస్తా జిల్లాలలో ఊపందుకోవడంతో పరిమితి వనరులతో అవసరమైన మేరకే రాజధాని నిర్మాణం చేపడితే ఈ ప్రచారానికి తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఏపీ సర్కార్ చేజేతులా తెచ్చి పెట్టుకున్న పరిస్థితులతో… రుణాలు దక్కడం కూడా అనుమానంగానే ఉంది. అందుకే.. పనులు ఎంత మేర ముందుకు సాగుతాయనేది అనుమానమేనంటున్నారు.