ఈమధ్య లెంగ్త్ విషయంలో హీరోలు, దర్శకులు చాలా క్లారిటీతో ఉన్నారు. సినిమా ఇంతకు మించకూడదు అంటూ స్కేళ్లు పట్టుకుని మరీ రెడీ అవుతున్నారు. అయినా రంగస్థలం లాంటి లెంగ్తీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలో విషయం ఉంటే, ఎంత లెంగ్త్ ఉన్నా చల్తా. కాకపోతే… ఒక్కోసారి నిడివి భారమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో అంత జాగ్రత్త పడుతున్నారు.
అయితే సరిలేరు నీకెవ్వరు మాత్రం 3 గంటల సినిమాగా రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన అవుట్ పుట్, తీయాల్సిన పాటలు ఇవన్నీ కలుపుకుంటే ఈ సినిమా మూడు గంటల వరకూ ఉండొచ్చని ఓ అంచనా. అనిల్ రావిపూడికి కామెడీ పై మంచి పట్టుంది. ద్వితీయార్థంలో కామెడీ సీన్లు బాగా పండాయట. వాటి వల్ల లెంగ్త్ ఎక్కువైందని తెలుస్తోంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ సినిమాని ట్రిమ్ చేసి కనీసం 15 నిమిషాలైనా కత్తిరించాల్సిన పరిస్థితి. కాకపోతే… ఆ బాధ్యత దిల్రాజు తీసుకుంటున్నారు. దిల్రాజు జడ్జిమెంట్ బాగుంటుంది. కథకు అవసరం లేదనుకుంటే ఆయన నిర్దాక్షణ్యంగా కట్ చేస్తుంటారు. సినిమా బాగా ఆడితే, ఆ తరవాత ఆయా సన్నివేశాల్ని కలుపుకుని, ఆ తరవాత.. ఆ రూపంలో మరిన్ని వసూళ్లు పెంచుకోవాలన్నది ప్లాన్. మహర్షికీ ఇలానే నిడివి ఓ సమస్యగా మారింది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కొన్ని సన్నివేశాల్ని కట్ చేశారు కూడా. సినిమా హిట్టయ్యింది కాబట్టి.. లెంగ్త్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.