మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం లోపు బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై..శివసేన వేసిన పిటిషన్‌పై..జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. ఈ మేరకు.. ఉత్తర్వులు జారీ చేసింది. మామూలుగా అయితే.. గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చారు. రేపటికి నాలుగు రోజులు అయిపోయినట్లవుతుంది. అంటే.. మూడు రోజులు ముందుగానే బలం నిరూపించుకోవాలని.. సుప్రీంకోర్టు ఆదేశించినట్లయింది. అసెంబ్లీలోని బల నిరూపణ జరగాలని.. రహస్య ఓటింగ్ వద్దని మొత్తం వ్యవహారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని.. ధర్మాసనం స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే.. కూటమిగా పోటీ చేసిన బీజేపీ – శివసేనకు మెజార్టీ వచ్చింది. రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసిన శివసేన.. బీజేపీ దిగి రాకపోయే సరికి.. ఎన్సీపీ – కాంగ్రెస్‌తో చర్చలు జరిపి.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే.. అనూహ్యంగా… రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తేసిన గవర్నర్ .. వెంటనే.. ఫడ్నవీస్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో.. పరిస్థితి ఉత్కంఠగా మారింది. చివరికి.. అజిత్ పవార్ ఒంటరయ్యారు. మిగిలిన మూడు పార్టీల ఎమ్మెల్యేలు.. ఒక్కటిగా ఉన్నామని బలప్రదర్శన చేశారు.
గత ఏడాది కర్ణాటకలో ఏర్పడిన పరిస్థితుల తరహాలోనే ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి చీలి… బీజేపీకి .. భారీగా.. అంటే.. కనీసం నలభై మంది ఎమ్మెల్యేలు మద్దతుగా వస్తేనే… బీజేపీ ప్రభుత్వం నిలబడుతుంది. అజిత్ పవార్ వైపు.. ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు కూడా.. మళ్లీ ఎన్సీపీ వైపు వచ్చేశారు. ఈ క్రమంలో.. ధిక్కరించే ఎమ్మెల్యేలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. తమకు.. యాభై మంది ఎమ్మెల్యేల అదనపు బలం ఉందని.. బీజేపీ చెబుతోంది. అదే నిజమైతే.. బుధవారం సాయంత్రం.. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదవడం ఖాయమే.