70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో.. ముఖ్యమంత్రి కేసీఆర్… రాజ్‌భవన్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్సవానికి హాజరయ్యారు. సహజంగా.. కేసీఆర్.. ప్రత్యేకమైన, ముఖ్యమమైన కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను ఆయన గుర్తించారు. కానీ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ విషయంలో సీఎస్‌కు.. సీనియర్ మంత్రికే వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి.. అంత తీరిక లేని కార్యక్రమాల్లో ఏమీ పాల్గొనడం లేదు. అయినప్పటికీ.. గవర్నర్ తో కలిసి రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశమయింది.
రాజ్యాంగ దినోత్సవంలో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్రతను దెబ్బ తీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చునని.. న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణగా ఉంటాయన్నారు. కేంద్ర కూడా.. రాజ్యాంగ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో… ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మాతృభాషపై మరోసారి మమకారాన్ని చాటుకున్నారు. అమ్మభాష కళ్లులాంటిదని, ఇతర భాషలు కళ్లజోడులాంటివని వ్యాఖ్యానించారు. భారతీయ భాషలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భాషపరంగా ఎటువంటి సమస్య ఉండకూడదని ఆకాంక్షించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సరైన సలహాదారులు లేరో.. లేక .. వారిచ్చిన సలహాలను ఆయన పాటించడం లేదో కానీ.. కొన్ని కొన్ని వ్యవస్థలు.. రాజ్యాంగం పట్ల.. ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం.. ప్రజలు.. అధికారవర్గాల్లో ఏర్పడుతోంది. ఇప్పటికి దీనిపై ఎవరూ పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చు కానీ.. తర్వాత తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్న అంచనా… వైసీపీ వర్గాల్లోనే ఏర్పడుతోంది.