మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. అస్త్ర సన్యాసం చేశారు. బలపరీక్ష జరగక ముందే వైదొలిగారు. అసెంబ్లీ వరకూ వెళ్తే పరువు దక్కదన్న నిర్ణయానికి వచ్చిన ఫడ్నవీస్ కూడా చేతులెత్తేశారు. తమకు సంఖ్యాబలం లేదని.. ప్రెస్మీట్ పెట్టి ప్రకటించారు. అంతకు ముందే అజిత్ పవార్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మ్యాజిక్ చేయబోయి చేతులు కాల్చుకున్నారు బీజేపీ వ్యూహకర్తలు. ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రంలోనూ… విఫలమవని విధంగా.. మహారాష్ట్రలో పరువు పోగొట్టుకున్నారు. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. తెల్లవారక ముందే.. ఫడ్నవీస్ తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ .. ఇప్పుడు.. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తిగా ప్రజల ముందు నిలబడిపోయారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెండు రోజుల సమయం ఇవ్వడానికి నిరాకరించి.. రాష్ట్రపతి పాలన విధించిన ఆయన.. ఆ తర్వాత.. ఫడ్నవీస్.. తమకు బలం ఉందని.. ఎలాంటి లేఖలతో క్లెయిమ్ చేసుకోకపోయినా… ఉన్న పళంగా రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫార్సు చేసి.. గంటల వ్యవధిలోనే… ఫడ్నవీస్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పుడా ఫడ్నవీస్.. బల నిరూపణ చేసుకోలేక చేతులెత్తేశారు. ఇక మహారాష్ట్రలో.. శివసేన- ఎన్సీపీ – కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే.
మొత్తంగా మహారాష్ట్ర వ్యహారంలో బీజేపీ ఘోరమైన తప్పిదానికి పాల్పడింది. రాజకీయ వ్యూహాత్మక తప్పటడుగులు వేసింది. శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమి..నిజానికి.. పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న కూటమి. ఈ కూటమికి ప్రజలు ఓట్లు వేయలేదు. అయితే.. ఇప్పుడు.. ఆ కూటమికి అధికారాన్ని దూరం చేసే లక్ష్యంతో బీజేపీ చేసిన.. రాజకీయంతో…ఆ మూడు పార్టీల కూటమికి ప్రజల్లో సానుభూతి పెరిగింది. చివరికి.. బీజేపీ చేతులెత్తేయడంతో.. రాజ్యాంగంతో ఆ పార్టీ ఆటలాడుకుందన్న అభిప్రాయం బలంగా ప్రజల్లోకి వెళ్తోంది.
గత ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఫలితాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో.. మహారాష్ట్రలో దాదాపుగా అదే జరిగింది. కర్ణాటకలో… మెజార్టీకి పది మందిలోపే ఎమ్మెల్యేలు అవసరం అయినప్పటికీ.. వారి కోసం బేరసారాలాడి.. ఫోన్లలో దొరికిపోయారు. దాంతో.. చివరికి.. చేతులెత్తేశారు. తరవాత మరో ఏడాదిన్నరకు.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి.. కుమారస్వామిని దింపేసి.. యడ్యూరప్ప సీఎం అయ్యారు.. అయితే.. ఉపఎన్నికల్లో ఫలితాలను బట్టే…అక్కడా బీజేపీ రాత తేలనుంది. మహారాష్ట్ర పరిణామాలు.. కర్ణాటకలోనూ..బీజేపీకి ప్రతికూలత తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది. రాజ్యాంగానికి విపరీత అర్థాలు తీసుకుని.. బీజేపీ చేస్తున్న రాజకీయం… ఇప్పుడిప్పుడు దుష్ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది.