వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు ఇంకా కేసుల నుంచి విముక్తి లభించలేదు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న నిందితుడు. సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరుగుతూనే ఉంది. ఆయనకు జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర ఉంది. సరే…ప్రజాస్వామ్యంలో దోషి అని తేలేంతవరకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. గెలిస్తే పదవులు కూడా అధిష్టించవచ్చు. ఈ వెసులుబాటు ఉంది కాబట్టే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా ఆరోపణలున్నాయి. కేసులున్నాయి. కాకపోతే ఆయన ఇప్పటివరకు జైలుకు వెళ్లలేదు. ఆయన్ని జైలుకు పంపాలని వైకాపా తహతహలాడుతోంది. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు.
టీడీపీని ఎన్నికల్లో ఓడించడంతో వైకాపాకు సగం పగ చల్లారింది. అది కూడా మామూలుగా కాదు. దారుణంగా ఓడించింది. బాబు మీద ఉన్న కేసుల్లో విచారణ జరిగి ఆయనకు ఏదైనా శిక్ష పడితే పగ పూర్తిగా చల్లారుతుందేమో…! అందుకే పాత కేసులను బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది. బాబును ఎక్కువగా అప్రతిష్ట పాలుచేసింది ‘ఓటుకు నోటు’ కేసు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులైన కొంతకాలానికే అంటే 2015లో ఓటుకు నోటు వివాదం రాజుకుంది. ఈ కేసు ఎందుకు వచ్చిందో, దాని స్వరూప స్వభావాలేమిటో జనాలకు తెలుసు. అప్పట్లో ఈ కేసు విషయంలో కేసీఆర్, చంద్రబాబు పరుష పదజాలంతో వాదులాడుకున్నారు. కేసీఆర్ అన్ని మర్యాదాలు తుంగలో తొక్కి బాబును బూతులు తిట్టాడు కూడా.’చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు’ అని కేసీఆర్ ఆనాడు అన్నాడు.
కసీఆర్ ఓటుకు నోటు మీద రచ్చ చేసేసరికి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి బయటకు తీశాడు. ఆ ట్యాపింగ్ కేసు ఎటు పోయిందోగాని ఓటుకు నోటు కేసు మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఓటుకు నోటు రచ్చ తరువాత బాబుతో కేసీఆర్ కొన్ని సందర్భాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఈ కేసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘ప్రత్యర్థులు నాపైన 26 కేసులు పెట్టారు. ఒక్కదాంట్లోనూ ఆరోపణలు రుజువు కాలేదు. కొన్ని కేసులు కొట్టేశారు’ అని బాబు గొప్పగా చెప్పేవాడు. దీంతో బాబు న్యాయమూర్తులను కూడా మేనేజ్ చేస్తారనే పేరొచ్చింది. ఇతర కేసుల్లో ఏదో మాయ చేసి తప్పించుకున్నా ఓటుకు నోటు కేసులో తప్పించుకోలేరని ప్రత్యర్థులు చెబుతుంటారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెసు ఎంపీగా ఉండగా, చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఈ కేసులో కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడనుకోండి. ప్రస్తుత మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2017లోనే విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.
ఇప్పటివరకు అది లిస్ట్ కాకపోవడంతో తాజాగా మరోసారి త్వరగా విచారణ చేయాలని కోరుతూ ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఓటుకు నోటు కేసు తెర మీదికి రావచ్చని కొందరు అనుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ‘అసలు ఈ కేసులో ఏముంది?’ అని ప్రశ్నించారు కొన్ని సందర్భాల్లో. విభజన చట్టప్రకారం హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు నోటు కేసు కారణంగానే చంద్రబాబు ఆంధ్రాకు వెళ్లిపోయాడని తీవ్రంగా ప్రచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి వీడియోలో దొరికిపోతే, చంద్రబాబు నాయుడు ఆడియోలో దొరికాడు. అయితే ఆయన ఆడియో సంభాషణ ఆయన నిందితుడని చెప్పేందుకు రుజువుగా ఉపయోగపడదని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ కేసు విచారణకు వస్తేగాని నిజానిజాలు తెలియవు.