జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆరు నెలలు పూర్తి చేసుకుంటూండగానే… ఆంధ్రజ్యోతి పత్రిక.. నెగెటివ్ యాంగిల్లో రోజుకో విశ్లేషణ చేస్తోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సలహాదారులపై కథనాన్ని ప్రచురించింది. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి .. జగన్మోహన్ రెడ్డి.. నెలకు.. నలుగురు, ఐదుగురు చొప్పున సలహాదారుల్ని నియమించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లో మొత్తం.. ఆయనకు ఏకంగా పందొమ్మిది మంది సలహాదారులు తయారయ్యారు. ఒక్కొక్కరికి నెలకు రూ. నాలుగు లక్షల వరకూ జీతభత్యాలు.. వారికి ఒక్కొక్కరికి.. ఎనిమిది మందితో మళ్లీ టీంను ఇచ్చారు. వారి ఖర్చులన్నీ ప్రభుత్వానివే. ఈ లెక్కన సలహాదారుల కోసం… వారి ఖర్చుల కోసం.. నెలకు రూ. రెండు కోట్ల వరకూ ప్రజాధనాన్ని ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తం 19 మంది సలహాదారుల్లో పది మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. అసలు కేబినెట్లో ఉండేదే… పాతిక మంది అయితే.. వారికి పోటీగా.. ఈ సలహాల కేబినెట్ తయారయింది. నిజానికి వీరెవరికి.. జగన్మోహన్ రెడ్డికి సలహాలిచ్చేంత పరిస్థితి లేదు. వీరిలో కొంత మంది నిపుణులే అయినప్పటికీ.. వీరి మాటలు వినడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండరు. తాను అనుకున్నది తాను చేయాలనుకుంటారు. పైగా.. చాలా మంది సలహాదారులు.. జీతాలు తీసుకుంటారు. కానీ.. ఎప్పుడూ.. సెక్రటేరియట్ వద్దకు కూడా రారు. బయట వైసీపీ ఆఫీసులోనో.. మరో చోటో.. తమ “సలహాల” పని పూర్తి చేస్తారు.
టీడీపీ హయాంలో ఆరుగురు సలహాదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురికి కేబినెట్ ర్యాంకు ఉండేది. ఈ సలహాదారుల్లోనూ చివరిదాకా ఉన్న వారు ఒకరిద్దరు మాత్రమేనని ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది. ఈ సలహాదారులందరి పని పంపకాల విషయంలో కీలకంగా వ్యవహరించడమే అన్న అర్థంలో ఆంధ్రజ్యోతి రాసింది. అయితే.. మీడియాపై కట్టడి జీవో విషయంలో… ఉన్న ప్రతిబంధకాలను అర్థం చేసుకుని.. ఆ తేడా రాకుండా.. జీతభత్యాల పంపకం కోసమే అన్నట్లుగా విశ్లేషించింది. కానీ.. అసలు విషయం మాత్రం.. “పంపకాల”ని చెప్పకనే చెప్పింది.