హీరోలు పారితోషికం విషయంలో రూటు మార్చారు. లాభాల్లో వాటా తీసుకుంటూ నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తున్నారు. సినిమా బాగుంటే ఆటోమెటిగ్గా తమ పారితోషికం కూడా పెరుగుతుంది. నిర్మాణంలో తామూ పాలుపంచుకున్నామన్న సంతృప్తి దొరుకుతుంది. మహేష్‌బాబు, రామ్‌చరణ్ లు ఈ బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడు సమంత కూడా ఈ దారే ఎంచుకుంటోంది.
ఓ బేబీ తరవాత సమంత కొత్త సినిమాలపై సంతకం చేయలేదు. రెగ్యులర్ కథానాయిక పాత్రలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దాంతో పాటు సొంత నిర్మాణం వైపు కూడా దృష్టి పెట్టింది. అటు సురేష్ ప్రొడక్షన్స్ లోనూ, ఇటు అన్నపూర్ణ స్డూడియోస్లోనూ సినిమాలు తీసుకునే వెసులుబాటు తనకు ఉంది. కానీ తనదైన ముద్ర వేయాలంటే సొంత నిర్మాణ సంస్థ ఉంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే.. అతి త్వరలో నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టబోతోంది. ఇక మీదట తన దగ్గరకు వచ్చిన నాయికా ప్రాధాన్యం ఉన్న కథలన్నింటికీ తన నిర్మాణంలోనే రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. సినిమా బడ్జెట్‌ని బట్టి, ఇతర సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఇది కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే. మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం పారితోషికంతోనే సరిపెట్టుకోబోతోంది. తన బ్యానర్లో చైతూతో కూడా ఓసినిమా ప్లాన్ చేయాలని చూస్తోంది. మొత్తానికి అన్నపూర్ణ స్డూడియోస్కి అనుబంధంగా మరో నిర్మాణ సంస్థ పుడుతున్నట్టే.