ప్రధానమంత్రి నరేంద్రమోడీని అయినా.. హోంమంత్రి అమిత్ షాను అయినా… కలవాలంటే.. కచ్చితంగా విజయసాయిరెడ్డితో పాటే వెళ్లి కలవాలని.. వైసీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలకు స్పష్టంగా చెప్పారు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ ఆంక్షలు పెట్టారో కానీ… కొంత మంది ఎంపీలు మాత్రం.. దీన్ని లెక్క చేయడం లేదు. మొన్నటికి మొన్న… రఘురామకృష్ణంరాజు రేపిన కలకలం ఇంకా.. కొనసాగుతూండగానే.. ఈ సారి ఆ బాధ్యతను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం.. నరేంద్రమోడీని కలిసినట్లు ఆయన చెప్పుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి.. ఎన్నికలకు ముందు వరకూ.. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఆయనకు ఒంగోలు లోక్ సభ టిక్కెట్‌ను.. టీడీపీ తరపున ఖరారు చేశారు. అయితే.. నాటకీయ పరిణామాల మధ్య.. ఆయన వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరే ముందు.. తనపై అనేక రకాలైన ఒత్తిళ్లు వస్తున్నాయని టీడీపీ అధినేతకు చెప్పి వెళ్లిపోయారు. టీడీపీపై ఆయన ఎలాంటి విమర్శలు చేయలేదు. గత ఎన్నికల్లో కొంత మందికి.. టీడీపీ తరపున లోక్‌సభ టిక్కెట్లు ఖరారైనప్పటికీ.. వైసీపీలో చేరమని.. ఒత్తిడి వచ్చింది. అలాంటి వారంతా.. ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రఘురామకృష్ణంరాజుకు కూడా.. టీడీపీ నుంచి నర్సాపురం ఎంపీ టిక్కెట్ ఖరారయింది. అయినా కూడా ఆయన… చివరి క్షణంలో వైసీపీలో చేరారు.
గెలిచినప్పటి నుంచి ఆయన మోడీతో.. సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీని పల్లెత్త మాట అనడం లేదు. వీరిద్దరూ వ్యాపారవేత్తలే. ఎంపీలు.. కొంత మంది.. సొంత ఎజెండాను అమలు చేసుకుంటున్నారని.. జగన్‌కు.. విశ్వసనీయ సమాచారం అందింది. ఇలా .. సొంత పనులు చక్క బెట్టుకునేవాళ్లు.. పార్టీ పట్ల విశ్వాసంగా ఉండరని.. అవసరం కోసం పార్టీ మారిపోతారని.. వైసీపీ అధినేత భావించి.. ముందస్తు హెచ్చరికలు పంపారంటున్నారు. అయితే.. అవేమీ పని చేయడం లేదని.. తాజా భేటీలతో తెలిసిపోతోంది.