మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతీరోజూ ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఉంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. పదవుల పంపిణీ విషయంలో శివసేనకు 16, కాంగ్రెస్ కి 13, ఎన్సీపీకి 15 చొప్పున కేబినెట్ బెర్తుల పంపిణీపై ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ పేర్లు ఖరారు అయ్యాయని ముందుగా వార్తలొచ్చాయి. వీరిద్దరూ రొటేషన్ లో రెండున్నరేళ్లు ఒకరు చొప్పున పదవుల్లో ఉంటారని ఒప్పందం కుదిరిందనీ అన్నారు. కానీ, ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే… అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ముందుగా భాజపాతో కలిసి వెళ్లి, మళ్లీ వెనక్కి రావడంతో రాజకీయంగా అజిత్ పవార్ పనైపోయిందని అనుకుంటే… ఎన్సీపీ లెజిస్లేచర్ పార్టీ పగ్గాలు ఆయనకే దక్కడం అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు! దీంతో ఇప్పుడు వచ్చే రెండున్నరేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన చేపట్టే అవవకాశం ఉందని అంటున్నారు. ఆయన సీఎం పదవినే డిమాండ్ చేసినట్టు కథనాలు వస్తున్నాయి. కానీ, డెప్యూటీ సీఎంకి ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు. నిజానికి, అజిత్ పవార్ భాజపావైపు వెళ్లినప్పుడు… ఆయన వెంట ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లలేదు. ఆయన్ని శాసన సభ పక్ష నేతగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు తిరిగి రాగానే ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ అదే ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటం విశేషం. భాజపా నుంచి తిరిగి తన శిబిరానికి వచ్చాక, ఆయనపై ఎలాంటి విముఖతా వ్యక్తం కానీయకుండా శరద్ పవార్ జాగ్రత్తలు పడ్డారని అనొచ్చు.
గురువారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్. ఛీఫ్ మోహన్ భగవత్ తోపాటు హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను శివసేన ఆహ్వానించింది. సీనియర్ నేత అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు విపక్షాలకు చెందిన ప్రముఖులను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలుస్తున్నారు. దీంతో, వీరిలో ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరౌతారు, వీళ్ల కాంబినేషన్ ఎలా కుదురుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా, గురువారం సాయంత్రం ప్రభుత్వం కొలువు దీరడంతో మహా రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.