తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఎలాగైనా.. ఏపీ క్యాడర్‌కు తీసుకు రావాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో విధులకు డుమ్మాకొట్టేసిన.. శ్రీలక్ష్మి కూడా.. ఢిల్లీలోనే ఉండి.. తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. విజయసాయిరెడ్డి మరోసారి ఆమెను తీసుకుని.. కేంద్రమంత్రులను కలుస్తున్నారు. సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ను పార్లమెంట్లో విజయసాయిరెడ్డి కలిశారు. ఆయన వెంట శ్రీలక్ష్మి ఉన్నారు. పెండింగ్ లో ఉన్న.. శ్రీలక్ష్మి క్యాడర్ మార్పు అంశాన్ని… కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు విజయసాయిరెడ్డి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్లో ఉన్న శ్రీలక్ష్మిని…జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంవోలోకి తీసుకోవాలనుకున్నారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. కానీ.. కేంద్రం అంగీకరించలేదు. సీబీఐ కేసులు ఉన్న అధికారులను అంతర్రాష్ట్ర డిప్యూటేషన్లకు అంగీకరించడానికి అవకాశం లేదు. ఈ కారణంగానే… శ్రీలక్ష్మి డిప్యూటేషన్ పెండింగ్ లో ఉంది. అయితే.. తెలంగాణ నుంచి స్టీఫెన్ రవీంద్ర అనే మరో ఐపీఎస్ ను కూడా డిప్యూటేషన్ పై.. తెచ్చుకోవాలని జగన్ భావించారు. సర్వీస్ రూల్స్ ప్రకారం. .. అలా పంపడం కుదరదని..కేంద్రం తేల్చిచెప్పేసింది. కానీ..శ్రీలక్ష్మి విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడంతో..విజయసాయిరెడ్డి అమెను తీసుకుని కేంద్ర మంత్రుల వద్దకు అదే పనిగా తిరుగుతున్నారు.
శ్రీలక్ష్మి కొంత కాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆమెకు ఏపీ భవన్ లో మకాం ఏర్పాటు చేశారు అధికారులు. ఆమె పెట్టే ప్రతి రూపాయి ఖర్చూ ఏపీ భవన్ ఖాతాలోనే పడుతోంది. నిబంధల ప్రకారం ఇప్పటికీ ఆమె తెలంగాణ క్యాడర్లోనే ఉన్నారు. తెలంగాణలో పని చేయడానికి ఇష్టపడని. శ్రీలక్ష్మి సెలవు పెట్టేసి.. ఢిల్లీలో మకాం వేశారు. అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించడంతో ఆయన చెప్పిన పనులు చేస్తున్నారు. ఓ రకంగా ఆయన పనులన్నీ శ్రీలక్ష్మి చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉంటే. రోజూ ఆయనకు రిపోర్ట్ చేస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి.. శ్రీలక్ష్మిని ఏపీ క్యాడర్ కు డిప్యూటేషన్ పై తీసుకు రావడాన్ని చాలెంజ్ గా తీసుకున్నారని చెబుతున్నారు.