ఆంధ్రప్రదేశ్లో తెలుగు కోసం.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా గళమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వారంలో నాలుగు రోజులు.. ఏపీలోనే ఉండి.. టీడీపీపై దుమ్మెత్తి పోసే ఆయన.. ఇటీవలి కాలంలో.. ఏపీ వైపు రావడం లేదు. ఏపీలో పరిస్థితులపై స్పందించడం లేదు. అయితే.. తెలుగు కోసం.. తొలి సారి ఆయన రాజ్యసభలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏపీలో తెలుగు మీడియంను రద్దు చేసి ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగిస్తున్న అంశాన్ని రాజ్యసభలో జీవీఎల్ ప్రస్తావించారు. తెలుగుభాషలో చదివినవారు కూడా.. ఆ తర్వాత ఆంగ్లంలో ప్రావీణ్యం పొందారని జీవీఎల్ సభా సాక్షిగా గుర్తు చేశారు.
మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చేలా.. ఏపీ ప్రభుత్వానికి సూచించాలని రాజ్యసభ వేదికగా జీవీఎల్ కేంద్రాన్ని కోరారు. జీవోను సవరించేలా రాష్ట్రానికి తగిన ఆదేశాలివ్వాలన్నారు. ఇదే విషయాన్ని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల కూడా.. రాజ్యసభలో ప్రస్తావించారు. మాతృభాష అంశాన్ని బీజేపీ కూడా.. ప్రాధాన్యతాంశంగా తీసుకుంది. ఏపీలో.. తెలుగు మీడియం రద్దుపై జరుగుతున్న రగడ సమయంలోనే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… మాతృభాష గొప్పతనాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. అదే సమయంలో.. ఏపీలో బీజేపీ నేతలు కూడా… తెలుగు మీడియం రద్దును తప్పు పడుతున్నారు. ఇంగ్లిష్ మీడియంను స్వాగతిస్తున్నా.. తెలుగు మీడియంను రద్దు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి మాతృభాష ను కాపాడే విషయంలో… కొన్ని రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయని.. తెలుగు మీడియంను రద్దు చేయడం సాధ్యం కాదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో.. మెల్లగా.. ఈ విషయాన్ని బీజేపీ . . కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.