మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమం రాజకీయంగా ఒక భారీ ఈవెంట్ అవుతుందనీ, ఒక కొత్త రాజకీయ చిత్రం ఆవిష్కృతం కావడానికి వేదిక అవుతుందని ముందుగా చాలా అంచనాలు వినిపించాయి. కానీ, అలాంటి చిత్రమేదీ ఇక్కడ జరగలేదు. ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించారు. వీరితోపాటు ఆర్.ఎస్.ఎస్. నుంచి మోహన్ భగవత్, భాజపా సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని కూడా ఉద్ధవ్ పిలిచారు. కానీ, వీళ్లెవ్వరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే ఆ ప్రాంగణం ఒక అరుదైన కలయికకు వేదిక అయ్యేది.
ఆ మధ్య కర్ణాటకలో ఇలానే భాజపాయేతర రాజకీయ పార్టీలన్నీ ఒక వేదిక మీదికి వచ్చాయి. ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణం చేస్తుంటే… భాజపాయేతర పార్టీల నాయకులంతా చేతులు కలిపి, తమ కలయిక అపూర్వమనీ భాజపాకి తామే చెక్ పెట్టబోతున్నామన్నట్టుగా అప్పట్లో సందేశాలిచ్చారు. ఆ తరువాత, ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! ఆ అనుభవం ఉంది కాబట్టి… ప్రముఖ నాయకులను ఉద్ధవ్ థాక్రె స్వయంగా ఆహ్వానించినా, ఉద్దేశపూర్వకంగా వారంతా గైర్హాజరు అయ్యారని అనిపిస్తోంది. కర్ణాటక తరహా ఫార్ములాను మహారాష్ట్రలో కూడా భాజపా తెరమీదికి తెస్తుందా, ఇక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి, ఏదో ఒక వ్యూహాన్ని సమీప భవిష్యత్తులో అమలు చేస్తుందా అనే అంచనాలూ లేకపోలేదు.
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు పార్టీలూ మూడు విభిన్నమైన వాదనలో ఉన్నవి. శివసేన పూర్తిగా హింధుత్వ వాదం వినిపిస్తూ, స్థానికత అంశాన్ని ప్రముఖంగా ప్రొజెక్ట్ చేస్తుంటుంది. ఎన్సీపీ పూర్తిగా రైతు పక్షపాతిగా ఉంటుంది. ప్రజలకు అన్యాయం చేస్తోందంటూ కాంగ్రెస్ ని విమర్శిస్తూ చీలి ఏర్పడ్డ పార్టీ ఇది. ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయంటే… దీని మనుగడ ఎలా ఉంటుందీ అనుమానం ఆయా పార్టీల ప్రముఖ నేతలకు కచ్చితంగా ఉంటుంది. అందుకే, దీన్నొక విజయంగా భారీగా సెలబ్రేట్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రముఖ నేతలూ పెద్దగా మొగ్గుచూపని పరిస్థితి. గురు భావనతో ఆర్.ఎస్.ఎస్. అధినేతను ఉద్ధవ్ పిలిచినా… మోహన్ భగవత్ రాలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు.