స్పీకర్ తమ్మినేని సీతారం మొదట ఆముదాల వలస ఎమ్మెల్యే. ఆయన స్పీకర్గా.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు లేదా.. స్పీకర్ హోదాలో అధికారిక సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం… ఆ స్థాయిలో ఉంటారు. మిగతా సందర్భాల్లో ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తూంటారు. అందుకే పలు సందర్భాల్లో తనదైన శైలిలో పరుషమైన వ్యాఖ్యలు చేసి..మీడియాలో హైలెట్ అయ్యారు. చంద్రబాబు గుడ్డలూడదీస్తామన్నా…. సోనియా గాంధీ, చంద్రబాబులది.. రాజకీయ లం… త్వం అని.. ఏ మాత్రం సంకోచించకుండా చెప్పినా… అది ఆయన స్టైల్. తాజాగా.. ఆయన అధికారులపై తన నోటి పవర్ చూపించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పాట్కొచ్చి కొడతా అని దూసుకెళ్లారు.
మహాత్మ జ్యోతిబాపూలే వర్థంతి సందర్భంగా శ్రీకాకుళంలో అధికారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి.. తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కానీ.. ఆయనకు అధికారులు అధికారికంగా ఆహ్వానం పంపలేదట. అందుకే.. కార్యక్రమానికి రాగానే..అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రొటోకాల్ ఉల్లంఘన పునరావృతమైతే స్పాట్లో కొట్టేస్తానని హెచ్చరించారు. స్పీకర్ ఆగ్రహం చూసి.. అధికారులు కూడా ఫీలైపోయారు. అసలు జరిగిందేమిటో చెప్పకుండా… ఇలా చేయడంతో వారు మనస్థాపానికి గురయ్యారు.
నిజానికి శ్రీకాకుళం యూనివర్శిటీలో పాల్గొనేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిన్ననే వచ్చారు. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు చేశారు. అందరూ … గవర్నర్ పర్యటనలో బిజీగా ఉంటారు కాబట్టి.. ఎవరిని ఆహ్వానించినా రారనే ఆలోచనతో పిలువలేదని.. అధికారులు చెబుతున్నారు. ముందు తాను ఎమ్మెల్యేని.. తర్వాత స్పీకర్ని అని పదే పదే చెప్పే.. తమ్మినేని.. ఎక్కడికి వెళ్లినా.. స్పీకర్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనని.. డిమాండ్ చేయడమే అసలు విశేషం.