తెలుగు360 రేటింగ్: 2.75/5
ఫేక్…
అన్నిటా ఫేకులే. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, పళ్లు కల్తీ, మందులు కల్తీ. ఆఖరికి చదువు కూడా కల్తీనే. రెండు వేలు పెడితే చాలు.. కోరుకున్న సర్టిఫికెట్ చేతికి వచ్చేస్తుంటుంది. అలాంటి ముఠాలు దొరికినా – అది పేపర్లో చిన్న వార్తగా మిగిలిపోతుంది. అయితే ఆ సర్టిఫికెట్ల వెనుక ఓ పెద్ద మాఫియానే ఉంటుంది. ఆ మాఫియా చుట్టూ అల్లుకున్న కథ ‘అర్జున్ సురవరం’. ఏదైనా ఓ సోషల్ ఎలిమెంట్‌తో కథ అల్లుకోవడం, సినిమా తీయడం – సేలబుల్ పాయింటే. కానీ ఆ సోషల్ ఎలిమెంట్ ఎంత మందికి కనెక్ట్ అవుతుంది? ఎంత పక్కాగా, ఎంత ఆసక్తిగా తెరపై తీయగలుగుతారు? అనేది చాలా కీలకం. మరి ఈ విషయంలో ‘అర్జున్ సురవరం’కి ఎన్ని మార్కులు పడతాయి..? ఎన్నోసార్లు విడుదల తేదీ వాయిదా వేసుకుంటూ వేసుకుంటూ, టైటిల్ మార్చుకుని మరీ వచ్చిన నిఖిల్ సినిమా తనదైన ‘ముద్ర’ వేసిందా? లేదా?
కథ
అర్జన్ లెనిన్ సురవరం (నిఖిల్) టీవీ 99లో పనిచేస్తుంటాడు. తండ్రి (నాగినీడు) కి ఈ విషయం తెలీదు. తన కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనే భ్రమల్లో ఉంటాడా తండ్రి. పాత్రికేయ వృత్తి ద్వారా పది మందికీ మంచి చేయాలన్నది అర్జున్ ఉద్దేశం. బీబీసీ క్రైమ్ రిపోర్టర్‌గా ఉద్యోగం సంపాదించాలన్నది కల. అయితే సడన్‌గా అర్జున్ జీవితం మలుపు తిరుగుతుంది. ఫేక్ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందాలనుకున్న నేరంపై పోలీసులు అరెస్టు చేస్తారు. అర్జున్‌కి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా బలంగా ఉంటాయి. కోర్టులో దోషిగా నిరూపణ అవుతుంది. బెయిల్ పై విడుదలైన అర్జున్ ఈ కేసులో ముద్దాయిలా కాకుండా, ఓ రిపోర్టర్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ప్రయాణంలో తనకు తెలిసిన నిజాలేంటి? ఫేక్ సర్టిఫికెట్ల భాగోతాన్ని ఈ ప్రపంచానికి ఎలా తెలియజేశాడు? అనేదే కథ.
విశ్లేషణ
ఫేక్ సర్టిఫికెట్ అనే పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే విషయమే. ఎందుకంటే దాంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఇబ్బంది పడుతున్నవాళ్లు మనలోనే ఎంతో మంది ఉన్నారు. పైగా ఇది యువతరం సమస్య. సో.. పాయింట్ పరంగా ‘అర్జున్ సురవరం’ గురి తప్పలేదు. ఈ కథని మొదలెట్టిన తీరు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. అర్జున్ పోలీసులకు లొంగిపోవడం – ఆ తరవాత ఇన్వెస్టిగేషన్ – అందులో భాగంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్.. ఇవన్నీ మెల్లగా మనల్ని కూడా కథలోకి లాక్కెళతాయి. ఇంత సీరియస్ ఇష్యూలో కాస్త రిలాక్స్‌గా ప్రేక్షకులు కూర్చున్నారంటే అది వెన్నెల కిషోర్, సత్యల కామెడీ వల్లే. కథ నుంచి పక్కకు పోకుండా అక్కడక్కడ… నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ని తీసుకున్నాం కదా అని అనవసరంగా డ్యూయెట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ఒకే ఒక్క డ్యూయెట్ ఉంది. అది కూడా డీసెంట్‌గానే సాగింది. అర్జున్ అన్నిరకాలుగా ఇరుక్కుపోవడం, అందులోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు,వీటన్నింటికీ వెనుక ఉన్న మాఫియా లీడర్ని వెదుక్కుంటూ వెళ్లే ప్రయత్నాలు ఇవన్నీఆసక్తిగానే సాగాయి.
తొలి సగంతో పోలిస్తే.. ద్వితీయార్థం ప్రారంభం నెమ్మదించినట్టు కనిపిస్తుంది. ఫేక్ సర్టిఫికెట్ల నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్లో థ్రిల్లింగ్ మూమెంట్స్ పెద్దగా కనిపించవు. పోసాని ఎపిసోడ్ నుంచి మళ్లీ కథ ట్రాక్ ఎక్కుతుంది. ఎమోషన్‌గా కనెక్ట్ అవుతుంది. తన ఫేక్ సర్టిఫికెట్ కోసం అర్జున్ విలన్ డెన్లోకి అడుగుపెట్టడం, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, ఫ్లాష్ బ్యాక్‌లో స్కూలు పిల్లల ఎపిసోడ్ – ఇవన్నీ ద్వితీయార్థాన్ని నిలబెడతాయి. కాకపోతే ‘ఇంకేదో మిస్ అయ్యిందే’ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది.
దర్శకుడు ప్రతీ చిన్న విషయానికీ బాగానే లాజిక్ వేసుకున్నాడు. కాకపోతే కథకు మూలమైన ఎడ్యుకేషన్ లోన్ విషయంలోనే లాజిక్ లేదేమో అనిపిస్తుంది. ఆ కేసులోనే హీరోని అరెస్టు చేస్తారు. ‘ఫేక్ సర్టిఫికెట్లతో లోన్ ఎలా అప్లయ్ చేశావ్’ అంటూ తన సర్టిఫికెట్లని రద్దు చేస్తారు. అక్కడి నుంచి కథానాయకుడి పోరాటం మొదలవుతుంది. అసలు లాజిక్ తప్పింది ఇక్కడే. ఫేక్ సర్టిఫికెట్లను కూడా వర్జినల్‌గా చూపించడం (సర్టిఫికెట్ క్లోనింగ్) ఈ ముఠా ప్రత్యేకత. అలాంటప్పుడు అవి తప్పుడు సర్టిఫికెట్లని ఎలా తేలాయి? పైగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ అధికారి (రాజా రవీంద్ర) కూడా ఈ ముఠాలో భాగమే అన్నట్టు చూపించారు. అలాంటప్పుడు ఈ కేసుని తానెందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? ఈ విషయంలో దర్శకుడు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది.
నటీనటులు
కాన్సెప్ట్ కథలు పట్టుకుని విజయాలు సాధిస్తూ వచ్చాడు నిఖిల్. ఇది సీరియెస్ ఎమోషన్‌తో సాగే క్రైమ్ థ్రిల్లర్. ఓ రిపోర్టర్‌గా నిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు నిఖిల్. యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. ఆ విభాగంలోనూ రాణించాడు. లావణ్య అందంగా కనిపించింది. కొన్ని సీరియస్ సన్నివేశాల్లోనూ కనిపించింది. అయితే రెగ్యులర్ నాయిక పాత్ర మాత్రం కాదు. వెన్నెల కిషోర్, సత్య… మెప్పిస్తారు. వెన్నెల కిషోర్‌కి ఈసారి సెంటిమెంట్ పండించే స్కోపూ దొరికింది. నాగినీడు, పోసాని ఆకట్టుకుంటారు. ప్రగతి అలవాటు ప్రకారం ఓవరాక్షన్ చేసింది. తరుణ్ అరోరా స్టైలీష్‌గా కనిపించాడు.
సాంకేతిక వర్గం
నిర్మాణ పరంగా పూర్తి మార్కులు పడతాయి. టేకింగ్ బాగుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పాటలు తక్కువ అవ్వడం ప్లాస్ పాయింట్. ‘చెగువెరా’ పాట ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. నేపథ్య సంగీతంలో ఒకే థీమ్ మాటి మాటికీ రిపీట్ అవుతుంటుంది. దర్శకుడు తన సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. తొలి భాగంలో సక్సెస్ అయ్యాడు. ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆ ఆసక్తిని కొనసాగించే విషయంలో ఇబ్బంది పడ్డాడు. అక్కడ కూడా దర్శకుడు ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వగలిగితే.. ‘అర్జున్ సురవం’ లక్ష్యం పూర్తిగా నెరవేరేది.
ఫినిషింగ్ టచ్: ‘ముద్ర’ పడింది!
తెలుగు360 రేటింగ్: 2.75/5