మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 80 గంటలు కాకముందే ప్రభుత్వాన్ని వదులుకోవలసి వచ్చి భంగపడ్డ బిజెపి పార్టీ, తాజా పరిణామాలపై స్పందించింది. శరద్ పవార్ రాజకీయ చాణక్యత ముందు అమిత్ షా తేలిపోయాడు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో, శివసేన గద్దెనెక్కడం గురించి తనదైన శైలిలో విశ్లేషించారు బీజేపీ అధినేత అమిత్ షా.
ఎన్నికలకు ముందు తాము తీవ్ర విమర్శలు చేసిన అజిత్ పవార్ మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత అజిత్ పవార్ బిజెపి కి హ్యాండ్ ఇచ్చి సొంతగూటికి వెళ్లిపోవడం గురించి విలేకరులు అమిత్ షా ని ప్రశ్నించారు. మిమ్మల్ని అజిత్ పవార్ మోసం చేసినట్లుగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, మమ్మల్ని మోసం చేసింది అజిత్ పవారో, శరద్ పవారో కాదని, ఎన్నికల ముందు తమతో జుట్టు కట్టి ఓట్లు వేయించుకొని, ఎన్నికలయ్యాక ప్లేటు ఫిరాయించిన శివసేన మోసం చేసిందని భావిస్తున్నట్లుగా అమిత్ షా వెల్లడించారు. అదేవిధంగా అజిత్ పవార్ మీద కేసులు ఎత్తివేసినట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు.
ఇన్నేళ్ల పాటు శివసేన ని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు వాళ్ళతో ఎలా జతకట్టిందో సమాధానం ఇవ్వాలని వ్యాఖ్యానించిన అమిత్ షా, కాంగ్రెస్ , ఎన్సీపీ, శివసేన కూటమి ది అవకాశవాద రాజకీయం అని వ్యాఖ్యానించారు.