ప్రతిపక్షంలో ఉండగా.. తెలుగుదేశం పార్టీకి పని చేయకపోయినా.. పిలిచి పదవి ఇచ్చిన మరో నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నిన్నమొన్నటి వరకూ వ్యవహరించిన కారెం శివాజీ.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఆయనకు చంద్రబాబు పిలిచి మరీ పదవి ఇచ్చారు. ఆ పదవి కోసం పలువురు టీడీపీ నేతలు పోటీ పడినప్పటికీ… కారెం శివాజీకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వతా ఆయన కొంత టీడీపీకి ఫేవర్ గా మాట్లాడినప్పటికీ.. అధికారికంగా పార్టీలో చేరలేదు. ఆయనను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పదవిలో నియమించినందుకు చంద్రబాబు హైకోర్టుతో అక్షింతలు కూడా వేయించుకోవాల్సి వచ్చింది.
ఓ సారి కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నియామక ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఆ పదవి దక్కాలంటే.. ఉండాల్సిన నిబంధనల ప్రకారం.. శివాజీ న్యాయవిద్య చదవలేదని.. కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించే అర్హత ఆయనకు లేదని పిటిషన్లు హైకోర్టులో వాదించారు. ఈ పోస్టు భర్తీ కోసం ప్రకటన జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించాలని, సెర్చ్ కమిటీని నియమించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటుపడిన ప్రజాప్రతినిధులు, రిటైర్డు జడ్జిలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించే విషయమై ప్రభుత్వం ఆలోచించాలని కోర్టు ఆదేశించింది.
అయినప్పటికీ.. తర్వాత.. చంద్రబాబు.. మళ్లీ కారెం శివాజీనే.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించారు. ఇటీవలి కాలంలో వైసీపీతో దగ్గరి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లిష్ మీడియంను సమర్థించారు. అలాగే.. వైసీపీలో చేరే నిమిత్తం.. పదవికి రాజీనామా చేశారు. అంతకు మించిన పదవిని జగన్ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.