తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడి నియామకంపై ఆ పార్టీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విస్తరణలో భాగంగా వివిధ పార్టీల నుంచి కొంతమంది నేతలు వలస వచ్చారు. కొత్తగా వచ్చినవారిలో కొంతమంది కూడా ఢిల్లీకి వెళ్లి, అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్దల్ని కలుస్తూ ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు తీవ్రంగానే చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ కూడా మరోసారి పదవి దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీన్లో భాగంగా తన హయాంలో పార్టీ సాధించిన విజయాలపై ఓ నివేదికను అందిచారట! నాలుగు ఎంపీలు గెలిపించాననీ, ఇతర పార్టీ నుంచి ప్రముఖ నాయకుల్ని రప్పించాననేది ఆయన చెప్పుకుంటున్న విజయాలుగా తెలుస్తోంది.
లక్ష్మణ్ ను మరోసారి అధ్యక్షునిగా కొనసాగిస్తారా అనే అనుమానమూ ఉంది. ఎందుకంటే, కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారనీ, తమను పట్టించుకోవడం లేదంటూ సీనియర్లు కొందరు ఆయనపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేశారని సమాచారం. అధ్యక్షుడిగా లక్ష్మణ్ సాధించిందేం లేదనీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ఆ నాలుగు స్థానాలు దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవా ప్రభావంతో వచ్చాయనీ, సొంతంగా రాష్ట్రంలో భాజపాని ప్రభావంతంగా ఆయన నడిపిందేమీ లేదనేది వారి విశ్లేషణ. ఇటీవలి హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కూడా భాజపా పట్టుని సాధించలేకపోయిందనీ, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సి ఉందనేది సీనియర్ల ఫిర్యాదు.
అయితే, ఈ వాదన జాతీయ నాయకత్వానికి చేరిందని తెలిసిన లక్ష్మణ్… ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేశారని అంటున్నారు. జాతీయ నాయకుల్లో తనకు బాగా పరిచయం ఉన్నవారితో లాబీయింగ్ మొదలుపెట్టారని అంటున్నారు. అధ్యక్ష పదవి తనకు మరోసారి ఇవ్వాలనేదే ప్రధాన ప్రయత్నం. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితే వస్తే తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఓ ప్రతిపాదనను లక్ష్మణ్ వినిపిస్తున్నట్టు సమాచారం! ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఉన్నవారిని మాత్రమే అధ్యక్షునిగా ఉంచాలని జాతీయ నాయకత్వానికి తన అభిప్రాయంగా లక్ష్మణ్ చెప్పినట్టు తెలుస్తోంది. అంటే, కొత్తగా చేరిన వారికి ఛాన్స్ ఇవ్వొద్దని చెప్పడమే కదా! మరి, లక్ష్మణ్ చెబుతున్న సలహాలూ ప్రతిపాదనల్ని జాతీయ నాయకత్వం ఎలా పరిగణిస్తుందో చూడాలి. అధ్యక్ష్య పదవి, లేదా రాజ్యసభ సీటు… ఇవీ లక్ష్మణ్ పెట్టుకున్న ఆశలు!