ఓటు బ్యాంక్ ను పటిష్టం చేసుకోవడంతోపాటు 2024లో కూడా తిరిగి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేయాలని జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష తొలి సమావేశంలోనే స్పష్టం చేశారు. నవరత్నాల అమలు ద్వారా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకొనేందుకు, ఆయా వర్గాలలో తన మార్క్ పాలనను చూపించేందుకు జగన్ అడుగులేస్తున్నారు ఆరు నెలల పరిపాలనలో సీఎం అన్నీ ముంచే పనులే చేయలేదు.. కొన్ని మంచి పనులు కూడా చేశారు. వాటిలో.. ఒకటి. ఉద్యోగులకు రాగానే.. ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వడం. అలాగే.. మద్యాన్ని నియంత్రించేందుకు గట్టిగా ప్రయత్నించడం వాటిలో ముఖ్యంగాచెప్పుకోవచ్చు. ఇరవై శాతం మద్యం షాపులు తగ్గించి.. మిగిలిన వాటిని ప్రభుత్వ అధీనంలోనే నడుపుతున్నారు. బార్ల లైసెన్సులు కూడా రద్దు చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి.. 40 శాతం తగ్గించి..కొత్త బార్లకు అనుమతి ఇస్తారు.
Read Also : 6 నెలల పాలన : జగన్ ముంచేశారా..? మంచి చేశారా..?
రాగానే ఆశా వర్కర్ల జీతం రూ. పదివేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ నాలుగు నెలల వరకూ.. మళ్లీ ఆశా వర్కర్లు రోడ్డెక్కే వరకూ.. అమలు చేయలేదు. వలంటీర్ల పేరుతో.. మూడు లక్షల మంది వరకూ.. అలాగే.. గ్రామ సచివాలయాల పేరుతో.. మరో లక్షన్నర మందికి ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నియామకాలు జరిపారు. వీరిలో వంటీర్లు మినహా.. గ్రామ సచివాలయ ఉద్యోగులు.. రెండేళ్ల తర్వాత శాశ్వత ఉద్యోగులవుతారు. జనవరి నుంచి ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కానీ.. పాలన చేపట్టిన తర్వాత మొదటి జనవరి ఇంకా రాలేదు.
కేంద్ర నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గిపోవటం, దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, రాష్ట్ర ఆదాయం పడిపోవడం.. ఆరు నెలల్లో ప్రభుత్వానికి మొదటి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టింది. కేంద్రం నుంచి వస్తాయనుకుంటున్న గ్రాంట్లు కూడా వెనక్కిపోయాయి. దీంతో నవరత్నాల హామీల అమలు కోసం ప్రభుత్వం రుణం కోసం బ్యాంక్ ల చుట్టూ తిరుగుతోంది. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం పరుగులు తీస్తున్నప్పటికీ, అవి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అనే పర్యవేక్షణ వ్యవస్థ కొరవడిందని వైసీపీ నేతలే అంటున్నారు. దీనివల్ల ఆయా కుటుంబాల్లో అసంతృప్తి వస్తుందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.