ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు అని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం? ప్రజలు చెప్పినట్లే అంతా జరుగుతుందా? వారు ఏం అనుకుంటే అది జరుగుతుందా? జరుగుతుంది. కాని అది ఎంతవరకు ఎన్నికల వరకు మాత్రమే. ప్రజలు ఎన్నికల్లో ఎవరిని అంటే ఏ పార్టీని గెలిపించాలనుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీని ఓడగొట్టాలనుకుంటే ఆ పార్టీ ఓడిపోతుంది. అంతవరకు వారు రాజులే. ఎన్నికల్లో అనుకున్నది చేయగలరు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు అన్నారేమో. ఎన్నికల తరువాత ప్రభుత్వాల ఏర్పాటులో వారి ప్రమేయం ఉండదు. అదంతా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు వచ్చిన సీట్లను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి ఉంటుంది. ఎన్నికల ముందు, తరువాత కూడా కొన్ని పార్టీలు కలిసి కూటమి కట్టడం లేదా పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో ప్రజల పాత్ర ఏమీ ఉండదు. ఓట్లు వేయడం వరకే వాళ్ల బాధ్యత.
ఆ తరువాత జరిగే రాజకీయ సినిమా చూస్తూ ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కూటమిగా లేదా అలయన్స్గా లేదా ఫ్రంటుగా ఏర్పడటం తప్పు కాదని, దానిపై ఆంక్షలు లేవని, న్యాయస్థానాలు సైతం అడ్డుకోలేవని సుప్రీం స్పష్టం చేసింది. పాపం…కొందరు అమాయకులు పవిత్ర రాజకీయాలు కావాలని కోరుకుంటారు. అపవిత్ర పొత్తులు పెట్టుకున్నారని మండిపడుతుంటారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు చెబుతుంటారు. ‘రాజకీయం’ అనే మాటలోనే నెగెటివ్ సెన్స్ ఉంది. సామాన్యులు కూడా ఎవరినైనా విమర్శించినప్పుడు ‘ఏంటి…రాజకీయాలు చేస్తున్నావు?’ అంటారు. అంటే నువ్వు సరిగా వ్యవహరించడంలేదని, నిజాయితీగా లేవని చెప్పడమన్నమాట.
హిందూ మహాసభకు చెందిన సభ్యుడొకాయన మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెసు కూటమి అపవిత్రమైందని, అది రాజ్యాంగ విరుద్ధమైందని ఆరోపిస్తూ పిటిషన్ వేశాడు. కూటములుగా ఏర్పడటం రాజకీయ పార్టీల హక్కని, రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీం కోర్టు తేల్చిపారేసింది. మహారాష్ట్రలో కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు సిద్ధాంతాల రీత్యా, భావజాలం రీత్యా భిన్నమైనవి.అంటే ‘లైక్‌మైండెడ్’ కాదన్న మాట. ఎన్నికల్లో ఈ మూడు కలిసి పోటీ చేయలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అసలు ఎన్నికలో కలిసి పోటీ చేసింది బీజేపీ-శివసేన. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఈ రెండింటికీ మధ్య విభేదాలొచ్చాయి. ప్రజలు బిజేపీ-శివసేన కూటమిని అధికారంలోకి తేవాలని ఓట్లు వేశారని, భిన్న భావజాలం ఉన్న ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం అపవిత్ర రాజకీయమని కొందరన్నారు.
ప్రతి రాజకీయ పార్టీ తమది సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ అని, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏమీ చేయబోమని చెప్పుకుంటూ ఉంటాయి. ఇదంతా థియరీయే. ప్రాక్టికల్స్ వరకు వచ్చేసరికి రాజకీయ ప్రయోజనాలే ముందుకు వస్తాయి. సైద్ధాంతిక కారణాలవల్ల దశాబ్దాల తరబడి ప్రత్యర్థులుగా మెలిగిన పార్టీలు కూడా రాజకీయ అవసరాలరీత్యా కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం చూస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాతాలకు తిలోదకాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. శివసేనది, బీజేపీది దాదాపు ఒకటే భావజాలం. రెండింటి మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. కాంగ్రెసు, ఎన్సీపీలకు శివసేన మొదటినుంచి ప్రత్యర్థే. కాని బీజేపీతో విభేదాల కారణంగా సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి తాను దూరం పెట్టిన పార్టీలతోనే చేతులు కలిపింది.
ఒకప్పుడు మోదీపై, బీజేపీపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు అదే మోదీతో చెట్టపట్టాలేసుకున్నాడు. బీజేపీతో చెడిపోయాక దశాబ్దాలుగా వ్యతిరేకించిన, ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిందని శాపనార్థాలు పెట్టిన కాంగ్రెసుతో దోస్తీ చేశాడు. రాష్ట్రాన్ని చీల్చడానికే పుట్టిన టీఆర్ఎస్తో, తనకు పడని కమ్యూనిస్టులతో గతంలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. టీఆర్ఎస్ను ఓడగొట్టడానికి కమ్యూనిస్టులతో, టీజేఎస్‌తో కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇలాంటి ఉదాహరణలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. రాష్ట్రాల్లోనైనా, కేంద్రంలోనైనా ప్రభుత్వాలు ఏర్పాటుకావడం ప్రధానంగాని, అది సింగిల్ పార్టీ ప్రభుత్వమా? కూటమి ప్రభుత్వమా? అనేది ముఖ్యం కాదు. సంఖ్యాబలమే కీలకపాత్ర పోషించే ప్రజాస్వామ్యంలో పవిత్ర, అపవిత్ర రాజకీయాలంటూ ఉండవు. రాజకీయం రాజకీయమే.