అమరావతి రైతులకు కిషన్ రెడ్డి ఆపద్భాంధవుడిలా కనిపిస్తున్నారు. ఇండియా పొలిటికల్ మ్యాప్‌లో… అమరావతిని గుర్తించడంతో.. రైతులకు.. ఒకింత ధైర్యం వచ్చింది. ఇక ఏపీ సర్కార్ రాజధానిని కదిలించలేదనే.. భావనకు వచ్చారు. ఇక రాజధాని నిర్మాణాలతో పాటు. . ప్రభుత్వం తరపున.. తమకు రావాల్సిన ప్రయోజనాలను పొందడానికి కిషన్ రెడ్డి ద్వారానే.. ప్రయత్నాలు చేసేందుకు రాజధాని రైతులు నిర్ణయించుకున్నారు. గతంలో.. ఓ సారి ఏపీ పర్యటనకు వచ్చిన కిషన్ రెడ్డిని గుంటూరులో కలిసిన రైతులు..ఈ సారి హైదరాబాద్ వచ్చి… సమావేశం అయ్యారు. రాజధానికి తాము ఎలాంటి పరిస్థితుల్లో భూములు ఇచ్చామో… వివరించారు.
ఢిల్లీని మించిన రాజధానిని ఏపీకి కడతామన్న మోడీ హామీ … అది తమ భూముల్లో కడతామన్న చంద్రబాబు లక్ష్యం కారణంగానే.. ఇచ్చామని వివరించారు. రాజధానికి ఇచ్చిన భూములను అభివృద్ధి చేయాలని .. అమరావతిని శరవేగంగా నిర్మించాలని..కిషన్ రెడ్డికి రైతులు.. వినతి పత్రం ఇచ్చారు. రైతుల మాటలను సావధానంగా విన్న కిషన్ రెడ్డి… వారికి ధైర్యం ఇచ్చే మాటలే చెప్పారు. పవిత్ర ఆశయంతో అమరావతికి రైతులు భూములు ఇచ్చారని.. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల వారి పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా ఉందన్నారు.
రైతులకు విశ్వాసం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తాను అమరావతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని .. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎలాగోలా.. అమరావతి విషయంలో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్న రైతులు.. కిషన్ రెడ్డి ద్వారా.. ఆ ప్రయత్నంలో ముందడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.