చిరంజీవి తన కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, తెరకెక్కించిన చిత్రం ‘సైరా’. విడుదలకు ముందు ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. రిలీజ్ తరవాత కూడా ‘ఆహా..’ అన్నవాళ్లే. కానీ ఆ స్థాయిలో వసూళ్లు మాత్రం దక్కలేదన్నది పచ్చి నిజం. చిరు ఆశలు పెట్టుకున్న బాలీవుడ్‌లోనూ తమిళ, కన్నడలోనూ ‘సైరా’కి నిరాశే ఎదురైంది. అసలు సైరా వల్ల వచ్చింది ఎంత? పోయింది ఎంత? అనే లెక్కలు కూడా చిరు తేల్చేసినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఏరియాల వారిగా వచ్చిన వసూళ్ల వివరాలు చిరు సేకరించి, వాటిపై సమీక్ష చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో ఈ సినిమా ఎందుకు ఆడలేదు? మిగిలిన చోట పట్టించుకోకపోవడానికి కారణాలేంటి? అనే విషయాల్ని చిరు తన సన్నిహితులతో విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి చరణే నిర్మాత. కాబట్టి ఆ లెక్కలన్నీ పక్కగా ఉండడం చాలా కీలకం. పైగా ఈమధ్య ఐటీ రైడ్స్ బాగా జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ కన్ను చిత్రసీమపై పడింది. అందుకే… ఈ లెక్కలన్నీ పక్కగా చేసి పెట్టుకోవాలని చిరు భావించాడట. అందుకు తగ్గట్టుగా ఎకౌంట్స్ అన్నీక్లియర్ చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యింది? ఎక్కడ దుబారా జరిగింది? అనే విషయాలపై చిరు బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మీదట అలాంటి తప్పులు పునరావృతం చేయకుండా ఉండాలన్నది చిరు ఉద్దేశం. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచున్నారు. సుదీప్, విజయ్‌సేతుపతి, తమన్నా, జగపతిబాబు ఇలా హేమా హేమీలంతా ఉన్నారు. వాళ్లకు సాధారణంగా అందే పారితోషికం కంటే, ఈసినిమా కోసం ఎక్కువే ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ పారితోషికం తీసుకోలేదు గానీ, ఆయనకు బహుమానం రూపంలో బాగానే ముట్టినట్టు తెలుస్తోంది. నయనతార కూడా కళ్లు చెదిరే పారితోషికం అందుకుంది.
ఈ సినిమాలోఓ చిన్న పాత్ర పోషించిన క్యారెక్టర్ నటుడు దాదాపు 70 లక్షల పారితోషికం తీసుకున్నాడట. పది సినిమాలు చేసినా రానంత పారితోషికం ఈ ఒక్క సినిమాకే అందింది. దాన్ని బట్టి ఏ స్థాయిలో పారితోషికాలు ఇచ్చారో అర్థం చేసుకోవొచ్చు. మేకింగ్ డేస్ ఎక్కువ కావడం కూడా `సైరా`ని బాగా ఇబ్బంది పెట్టింది. జూనియర్ ఆర్టిస్టుల బిట్లు దాదాపు 7 కోట్లు వచ్చిందని టాక్. ఇలా.. ప్రతీ చోటా డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టారన్న విషయం చిరు వరకూ వెళ్లింది. చరణ్ భవిష్యత్తులోనూ సినిమాలు తీయబోతున్నాడు. భవిష్యత్తులో తీయబోయే సినిమాలకు ఈ లెక్కలు ఓ పాఠంగా మిగలాలన్నది చిరు తాపత్రయం.