ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది. బడ్జెట్లో రూ. వంద కోట్లను కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకూ అసలు నిధులేమీ విడుదల చేయలేదని బ్రాహ్మణ సంఘాలు మండి పడుతున్నాయి. పేద బ్రాహ్మణులు పెద్ద ఎత్తున సాయం కోసం.. బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తున్నారు. కానీ.. అక్కడ ఉద్యోగులే లేరు. ఉన్న వాళ్లందర్నీ తీసేశారు. చంద్రబాబునాయుడు హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రారంభమయింది. ఆ సమయంలో చైర్మన్ గా నియమితులైన ఐవైఆర్ కృష్ణారావు.. పలువుర్ని కాంట్రాక్ట్ పద్దతిలో నియమించారు. ఆయనను తొలగించిన తర్వాత కూడా వారు కార్పొరేషన్లో కొనసాగారు.
అయితే.. కొత్త ప్రభుత్వం… రూ.40వేల పైబడి వేతనాలు పొందుతున్న సిబ్బందిని తొలగించాలని ఆదేశించింది. దీంతో.. కార్పొరేషన్లో పని చేసేవారిలో 90 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. తక్కువ జీతాలు తీసుకుంటున్న ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. దీంతో రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. పేద బ్రాహ్మణులకు చంద్రబాబు హయాంలో.. సామాజిక పెన్షన్లు మంజూరు చేశారు. వీటిని … బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు.. వాటి పంపిణీ నిలిచిపోయింది. దాదాపు పదిహేను వేల మంది పేద బ్రాహ్మణులు.. పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ పనులు చేయడానికి కొంత మంది సిబ్బంది అవసరం…కానీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదు.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి కొత్త ఉద్యోగుల నియామకం గురించి.. పదే పదే రిమైండర్లు పంపుతున్నారు కానీ.. అటు వైపు నుంచి స్పందన రావడం లేదు. దాంతో.. ఆయన కూడా మిన్నకుండిపోయారు. ఇతర విభాగాల్లో.. రూ. 40వేలకు మించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు అయితే.. కచ్చితంగా సిబ్బంది అవసరం ఉన్న చోట… మాత్రం.. ప్రత్యేక ఆదేశాలతో మళ్లీ విధుల్లో చేర్చుకున్నారు. పలు చోట్ల పనులు స్మూత్‌గా సాగుతున్నాయి. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్‌పై మాత్రం ప్రభుత్వం కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.