తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి వెయ్యేళ్ల క్రితం.. రామానుజచార్యులు నిర్ధేశించిన వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు.. వాటిని మార్చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.. టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులు పాటు కొనసాగించబోతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు లక్షల మంది వస్తారు. రెండు రోజుల పాటు తిరుమలలో భక్తజనం నిండిపోతుంది. ఈ కారణం చెబుతూ.. వైకుంఠ ద్వారా దర్శనాన్ని పది రోజుల పాటు కల్పించాలన్న ఆలోచన చేశారు టీటీడీ అధికారులు. వెంటనే.. దీనిని ఆగమ సలహాదారు రమణదీక్షితులు ముందు ఉంచారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి మకర సంక్రమణం జరిగే వరకు కూడా ద్వారాలను తెరిచి వుంచవచ్చునని సలహా ఇచ్చేశారు. దీంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయిందని… టీటీడీ అధికారికంగా నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఆనాదిగా వస్తున్న ఆచారాలను టీటీడి పక్కన పెట్టి ఏడాదికి రెండు రోజులు పాటు మాత్రమే తెరిచి వుంచే వైకుంఠ ద్వారాలను…..ఇప్పుడు పది రోజులు పాటు తెరిచి ఉంచాలనే ఆలోచనకు రావడం.. భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి భక్తుల తాకిడి.. అనేది సాకు మాత్రమేనంటున్నారు భక్తులు. ఎందుకంటే.. వైకుంఠ ఏకాదశి, ఏకాదశి రోజున మాత్రమే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. తర్వాతి రోజు ద్వాదశి రోజు కూడా పెద్దగా భక్తులు ఉండరు. ఇక మామూలు రోజుల్లో సాధారణ దర్శనంలాగే భావిస్తారు. పవిత్రమైన రోజులు రెండు రోజులే.. ఆ రెండు రోజులు కాకుండా.. వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకున్నా.. సాధారణ దర్శనమే అవుతుంది.
ప్రాధ్యనత లేని రోజులలో వైకుంఠ ద్వార దర్శనం అంటూ ప్రాధాన్యత కల్పించడం…..సంప్రదాయాలను ప్రక్కన పెట్టడమేనని భక్తుల వాదన. ఆలయంలో స్వామి వారికి జరిగే పలు సేవలను కూడా రద్దు చేయాలంటూ.. ఆగమ పండితులు ఇటీవల సలహా ఇచ్చారు. ఏళ్ళ తరబడి శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న పూజా కైంకర్యాలను నిలిపివేయాలనుకోవడం.. పద్దతి కాదని భక్తులు అంటున్నారు. ఏమైనా టీటీడీ … తీసుకునే ప్రతీ నిర్ణయం వివాదాస్పదమవుతోంది.