ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన పూర్తయింది. గతంలో పాలనానుభవం లేని ముఖ్యమంత్రి.. ఆరు నెలల కాలంలో.. తనదైన ముద్ర వేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పరిణామాలు ఎలా ఉంటాయో.. ఆలోచించే.. ఏ నాయకుడైనా నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్‌లో నిర్ణయాలు వచ్చే పరిణామాలు బాగుంటే.. మంచి నిర్ణయాలని.. లేకపోతే.. చెడ్డ నిర్ణయాలను నిర్ణయించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనలో మూడు రకాల మెరుపులు.. మూడు రకాల మరకలు … ప్రధానంగా విశ్లేషణకు వస్తున్నాయి.
జగన్ పాలనలో మెరుపులు మూడు..!
నవరత్నాల అమలుకు గుడ్ స్టార్ట్..!
మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చెబుతూంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అమలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు..మరో కారణం చెప్పి వెనుకడుగు వేయాలని ఆయన అనుకోవడం లేదు. ఈ విషయంలో..ఆరు నెలల్లో .. కార్యాచరణ ఖరారు చేసుకున్నారు. చాలా పథకాల అమలు ప్రారంభించారు. లబ్దిదారుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశారు. రైతు భరోసా కూడా.. ఇచ్చేశారు. ఇక మిగిలిన పథకాల నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ విషయంలో.. జగన్మోహన్ రెడ్డి మొదటి అడుగును ఆరు నెలల్లో విజయవంతంగా వేసేశారని అనుకోవాలి.
ఇంగ్లిష్ మీడియంతో సిక్సర్..!
ప్రభుత్వ స్కూళ్లన్నింటిలోనూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలన్న సంచలన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అయితే.. గతంలో టీడీపీ హయాంలో ఆయన దీన్ని వ్యతిరేకించి ఉండటం వల్ల.. కొంత మంది ట్రోల్ చేశారు. తెలుగు మీడియాన్ని ఎత్తేయడం మంచిది కాదని చాలా మంది విమర్శలు గుప్పించారు. వాటన్నింటినీ రాజకీయంగానే ఎదుర్కొన్న జగన్… చివరికి.. సైలెంటయ్యేలా చేయగలిగారు. సాధారణ ప్రజల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టడంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. అందుకే.. జగన్ ఎదురుదాడికి దిగారు కానీ.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
మద్యనియంత్రణలో చిత్తశుద్ధి..!
విడతలవారీగా మద్యాన్ని నియంత్రిస్తానని.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. దాని ప్రకారం..సిన్సియర్‌గా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేశారు. విమర్శలు వచ్చినా ప్రభుత్వమే.. దుకాణాలు నియంత్రిస్తోంది. దీని వల్ల బెల్ట్ షాపులు తగ్గిపోయాయి. బార్లను కూడా.. నలభై శాతం తగ్గించారు. వాటి లైసెన్సులు తగ్గించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల.. ఏపీలో మద్యం వినియోగం.. నలభై శాతానికిపైగా పడిపోయింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా… రేట్ల పెంచడం ద్వారా బ్యాలెన్స్ చేసుకుని… పాలన సాగిస్తున్నారు జగన్.
జగన్ పాలనలో మరకలు మూడు..!
రాజధానిపై డోలయమానం..!
కొత్త రాష్ట్రానికి రాజధాని లేదు. గత ప్రభుత్వం పునాదుల వరకు మాత్రమే తీసుకు రాగలిగింది. కొత్త ప్రభుత్వం అసలు ఆ పునాదుల్ని కూడా పట్టించుకోకుండా.. కొత్త రాజధాని దిశగా ఆలోచిస్తోంది. దీంతో.. పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. అమరావతి రాజధానిగా వద్దనుకున్న ప్రభుత్వం.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. ఘాటు రాజకీయ మార్గాలను ఎంచుకుంది. అమరావతిపై రకరకాల ప్రచారాలు చేయడం ప్రారంభించింది. ఇదంతా.. ముఖ్యమంత్రి వ్యూహం ప్రకారమే జరుగుతుందని.. ఆయనకు తెలియకుండా.. ఒక్కరూ నోరు మెదపరని.. వైసీపీలోనే అందరికీ తెలుసు. జగన్ కావాలని చేస్తున్న ఈ అమరావతి గందరగోళం… మొత్తానికే.. ఆయన ఆరు నెలల పాలనలో మొదటి మైనస్‌గా మారింది.
అభివృద్ధి మొత్తం రివర్స్..!
ఏపీలో ఆరు నెలల నుంచి ఒక్క అభివృద్ధి పని జరగడం లేదు. టీడీపీ హయాంలో.. వేసిన టెండర్లన్నింటికీ.. రివర్స్ టెండర్లు వేస్తూ.. ఆరు నెలల సమయం గడిపేశారు. ప్రాజెక్టులు, రోడ్లు, ఇళ్లు సహా.. ఏ ఒక్క పని జరగడం లేదు. రివర్స్ టెండర్లలో వేల కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది కానీ.. పని ఆగిపోయిన ఆరు నెలల కాలానికి… తర్వాత జరగబోయే జాప్యానికి కలిగే నష్టాన్ని అంచనా వేయలేకపోతోంది. ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టకపోవడంతో.. ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది.
రంగుల గోలతో అభాసు పాలు..!
ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మైనస్‌గా మారిన మరో అంశం… రంగులు. ప్రభుత్వం అధికారికంగా అభివృద్ధి పనులన్నింటికీ.. రంగులు వేయమని ఆదేశాలిచ్చింది. కొత్త ప్రభుత్వం చేపట్టిన వాటికి కాదు… ప్రభుత్వ ఆస్తి అన్నది ఏదైనా ఉంటే.. దానికి మొత్తం… రంగులేమని ఆదేశాలిచ్చింది. మొదట.. వాటర్ ట్యాంకులు.. తర్వాత గ్రామ సచివాలాయాలు.. తర్వాత మార్కెట్ యార్డులు.. ఇలా ఈ పరంపర కొనసాగింది. అధినేత ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నారేమో.. కానీ.. పార్టీ కార్యకర్తలు.. మరింత రెచ్చిపోయారు. స్మశానాలు సమాధాలు కూడా వదిలి పెట్టలేదు. ఇంత రంగుల పిచ్చేమిటని.. సామాన్యులు కూడా.. ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్మోహన్ రెడ్డి పాలన ఆరు నెలలు మాత్రమే సాగింది. ఆయన పాతికేళ్లు పాలించేలాగా… తన సంక్షేమ పథం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాధాన్యతాంశాల్లో.. అభివృద్ధి, పారిశ్రామికీకరణ లేవు. పథకాలు మాత్రమే ఉన్నాయి. ఈ కోణంలో చూస్తే.. ఆరు నెలల్లో ఆయన మెరుగైన పనితీరు కనబర్చినట్లే చెప్పుకోవచ్చు.