అందరి దృష్టీ సంక్రాంతిపై పడింది. ఆ సీజన్లో ఎప్పటిలానే వరుస సినిమాలొస్తున్నాయ్. ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుందో, ఏ సినిమాల మధ్య గట్టి పోటీ ఎదురవుతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సంక్రాంతి కంటే ముందు మరో ‘వార్’ ఉంది. డిసెంబరు 20న ఒకే రోజు.. మూడు సినిమాలు ఢీ కొట్టుకోబోతున్నాయి. అంటే బాక్సాఫీసుకు ముందే సంక్రాంతి రాబోతోందన్నమాట.
డిసెంబరు 20న పోటీ మామూలుగా లేదు. రూలర్, ప్రతిరోజూ పండగే, దొంగ సినిమాలు ఒకేసారి ఢీ కొట్టబోతున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ చిత్రం ‘దబాంగ్ 3’ కూడా రేసులో ఉంది. బాలయ్య సినిమా అంటే వీలైనన్ని ఎక్కువ థియేటర్లు ఆక్రమించుకోవడం ఖాయం. బీ,సీలలో బాలయ్య తన ప్రతాపం చూపిస్తాడు. అక్కడ బాలయ్యకు పోటీ లేదు. సినిమా ఏమాత్రం బాగున్నా – మిగిలిన వాటికి దెబ్బ తప్పదు. కాకపోతే బాలయ్య ఫామ్‌లో లేడు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాగా దెబ్బకొట్టింది. తన నుంచి ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో ఊహించలేం. కె.ఎస్.రవికుమార్ కూడా అంతే. ఎప్పుడైనా అద్భుతాలు ఇవ్వొచ్చు. ఎప్పుడైనా ఫ్లాప్ కొట్టొచ్చు. వీరిద్దరి నుంచి వచ్చిన ‘జై సింహా’ బాగా ఆడింది. సంక్రాంతి సీజన్లో విడుదలై, గట్టి పోటీని తట్టుకుని విజయం సాధించింది. ఈసారి కూడా ఈ పోటీలో బాలయ్య విన్నర్‌గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బాలయ్యకు పోటీగా సాయిధరమ్ తేజ్ రంగంలో దిగే సాహసం చేశాడు. తన కొత్త సినిమా ‘ప్రతిరోజూ పండగే’ని డిసెంబరు 20నే విడుదల చేస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇదో ఫ్యామిలీ డ్రామా. ఈసారి మారుతి ఎమోషన్స్‌కి పెద్ద పీట వేశాడు. తన మార్కు వినోదం తప్పనిసరి. బాలయ్య మాస్ ని టార్గెట్ చేస్తే.. ఈ సినిమా క్లాస్ వైపు దృష్టి పెట్టింది. గీతా ఆర్ట్స్ చేతిలో కావల్సినన్ని థియేటర్లుంటాయి. కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఏమీ ఉండకపోవొచ్చు. కాకపోతే బాలయ్య వేడిని ఏమాత్రం తట్టుకుంటాడో చూడాలి.
కార్తి సినిమా ‘దొంగ’ కూడా డిసెంబరు 20నే వస్తోంది. నిజానికైతే డబ్బింగ్ సినిమా కదా, పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ‘ఖైదీ’లాంటి సూపర్ హిట్ తరవాత కార్తి నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా జ్యోతిక ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. కార్తి అక్కగా జ్యోతిక నటించడం ప్రేక్షకుల్ని ఆకర్షించేదే. ‘దృశ్యం’లాంటి సినిమాని అందించిన జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు. ఏరకంగా చూసినా ‘దొంగ’ సీరియస్‌గానే పోటీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక బాలీవుడ్ సినిమా ‘దబాంగ్ 3’ కూడా ఆ రోజే వస్తోంది. పెద్ద నరగాల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఒకే రోజు నాలుగు సినిమాలంటే ప్రేక్షకులకు పండగే. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాలి.