ఢిల్లీ నిర్భయ తరహాలో బాధితురాలి ఐడెంటిటీ బయటకు తెలియకుండా.. చేయాలని.. హైదరాబాద్ పోలీసులు చాలా ఆలస్యంగా గుర్తించారు. బాధితురాలి పేరు చెప్పవద్దని.. దిషా పేరుతో పిలవాలంటూ… కమిషనర్ సజ్జనార్ మీడియాకు ఓ సందేశం పంపారు. జస్టిస్ ఫర్ దిషా అనే నినాదాన్ని ఆయన ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉంది. మీడియా కూడా.. కాస్త ఆలస్యంగా అయినా… నియంత్రణ పాటించడం ప్రారంభించింది. బాధితురాలి ఫోటోలను ప్రదర్శించడం మానేసింది. బాధితారాల్ని దిషాగా సంబోధిస్తోంది. అంత వరకూ బాగానే ఉన్నా.. దిషాకు న్యాయం ఎలా జరుగుతుందనేదే…ఇప్పుడు.. అందరి ముందు ఉన్న ప్రశ్న.
“దిషా”కు న్యాయం నిందితుల్ని ఎన్ కౌంటర్ చేస్తే వస్తుందా..?
ఇప్పుడు అందరూ భావోద్వేగంలో ఉన్నారు. దిషాకు న్యాయం చేయాలనే పట్టుదల అందరిలోనూ కనిపిస్తోంది. ఆ న్యాయం ఎలాంటిదంటే… దాదాపుగా.. 90 శాతం మంది ఒకటే చెబుతున్నారు. నిందితుల్ని… ఎన్ కౌంటర్ చేయడమో.. తక్షణం ఉరి తీయడమో.. లేకపోతే మరొకటో.. చెబుతున్నారు. దీని కోసం పోలీసుల్ని చట్టాలు ఉల్లంఘించమని కూడా సలహా ఇస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమైన సలహానో ఎవరూ ఊహించడం లేదు. ఈ పరిస్థితినే పోలీసులు రేపు అమాయకుల్ని వధించడానికి..వేధించడానికి వాడుకునే ప్రమాదం ఉంది. చట్టబద్దంగానే నిందితులకు శిక్ష విధించాల్సి ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఈ పని పూర్తి చేయాలి. దాని ద్వారా మరోసారి ఇలాంటి నేరం చేయాలంటే.. భయం కలిగేలా చేయాలి.
“దిషా”కు న్యాయం అంటే .. మరో ఆడపిల్లకు అలాంటి పరిస్థితి రాకుండా చేయడమే..!
దిషాకు న్యాయం చేయడం అంటే… మరో ఆడపిల్లకు అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చేయడమే…! దీని కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు.. దేశం మొత్తం గగ్గోలు రేగింది. కానీ.. ఏం జరిగింది…? అప్పటి ఆవేశం.. రాజకీయ నేతల హామీలు.. ప్రకటనలు చూసిన తర్వాత… పుట్టుకొచ్చిన చట్టం నిర్భయ.. ఎంత మందికి భయం కల్పించింది..? ఆ చట్టం వల్ల తాము జైలుకు వెళ్తామని.. ఎంత మంది భయపడ్డారు..?
మార్పు తెచ్చే ప్రయత్నం నిరంతరం సాగితే దిషాకు న్యాయం..!
సమాజంలో ఆడపిల్లలను చూసే దృక్కోణంలో మార్పు తీసుకు రాగలగాలి. ఒంటరిగా అమ్మాయి కనిపించిందంటే… మగాళ్ల మనసుల్లో చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో… అర్థం చేసుకోవాలి. వాటి నుంచి.. విముక్తి రావాలంటే.. ఏం చేయాలో ఆలోచించాలి. అందరి ముందు మంచిగా ఉండే మగవాళ్లు… ఆడది ఒంటరిగా కనిపిస్తే.. వెకిలి వేషాలు వేస్తారు. ఇలాంటి పరిస్థితులు.. సమాజంలో ఉన్నాయి. మనుషుల భావజాలాల్లో పాతుకుపోయాయి. అలాంటి పరిస్థితి మారాలంటే.. ఏం చేయాలో.. పాలకులు ఆలోచించాలి. మారుతున్న తరం మనసుల్లో పేరుకుపోతున్న మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తేనే … మార్పు వస్తుంది. అలా వస్తే… మరో నిర్భయ..మరో దిషాలు … రాకుండా ఉంటారు…