ఈమధ్య మహేష్ బాబు సినిమాల్లో మంచి ఊపొచ్చే పాటలు పడడం లేదు. శ్రీమంతుడు, మహర్షి.. అంటూ క్లాసీ కథల్ని ఎంచుకోవడం వల్ల ఆ తరహా పాటలకు స్కోప్ దొరకడం లేదు. అయితే ఇప్పుడు `సరిలేరు నీకెవ్వరు`తో మాత్రం ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలోంచి వచ్చిన తొలి పాటే – ఫుల్ మాస్ గా సాగింది. `మైండ్ బ్లాకూ..` అంటూ సాగే ఈ గీతాన్ని చిత్రబృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.
ఎపుడూ ఫ్యాంటేసేవాడు
ఇపుడు లుంగీ కట్టాడు
ఎపుడూ షర్టేసేవాడు
ఇపుడు ఝబ్బా తొడిగాడు
చేతికేమో మల్లెపూలు
కళ్లకేమో కళ్లజోడు
చుట్టేసి – పెట్టేసి వచ్చేశాడూ..
అంటూ సాగే ఈ పాటకు ‘మైండు బ్లాకు’ అనేది హుక్ లైన్ గా తీసుకున్నాడు. శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించాడు.
మధ్యలో మహేష్ మాటలు.. అభిమానులకు మరింత కిక్ ఇస్తుంటాయి.
బాబూ నీ మాసులుక్కు మైండు బ్లాంకూ
నువ్వే ఓ స్టెప్పు వేస్తే మైండు బ్లాకూ – చరణాల దగ్గర రిపీట్ గా సాగింది.పాటలోని పదాల్ని బట్టి చూస్తే ఇందులో మహేష్ పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తాడని స్పష్టంగా తెలిసిపోతుంది. పూల చొక్కా, కళ్ల జోడూ, లుంగీ అవతారంలో మహేష్ ని చూసేయొచ్చు. ఈ గెటప్‌లో మహేష్‌ని చూసి చాలా కాలం అయ్యింది. అభిమానులకు ఈ పాట మంచి ట్రీట్‌లా ఉండబోతోంది.
రాప్కి మాస్ బీట్ జోడించిన పాట ఇది. స్టైల్ కొత్తగా ఉంది. అయితే శ్రీమణి పదాలు మరీ అంత కొత్తగా లేవు. ముంత – పాల పుంత, నావా – లావా అంటూ అలవాటైన ప్రాసల ధోరణిలోనే పాట సాగించేశాడు. స్టెప్పులు వేయడానికి పూర్తి ఆస్కారం ఉన్న పాట ఇది. బహుశా తమన్నాతో మహేష్ స్టెప్పులు వేసింది ఈ పాటలోనేమో…? మొత్తానికి `సరిలేరు నీకెవ్వరు` ఆల్బమ్‌కి మంచి ఆరంభమే దొరికింది. మునుముందు పాటలు ఇంకెలా ఉంటాయో..?