కాదేదీ ప్రచారానికి అనర్హం అనే మాటని చిత్రసీమ గట్టిగా నమ్ముతోంది. పబ్లిసిటీకి పనికొచ్చే ఏ చిన్న విషయాన్నీ వదలడం లేదు. అయితే అందులోనూ వెరైటీని ఆశ్రయిస్తోంది. ఆఖరికి రిలీజ్ డేట్ ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. వెంకీ మామా సినిమానే అందుకు ఉదాహరణ.
ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు..? అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. సెటైర్లు, మైమ్ ల సంగతి చెప్పక్కర్లెద్దు. అందుకే… రిలీజ్ డేట్ ప్రకటించక తప్పడం లేదు. డిసెంబరు 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఎనౌన్స్ చేసేసింది. అయితే దాన్ని కూడా కాస్త వెరైటీ పబ్లిసిటీగా వాడుకున్నారు. రానాపై ఓ వీడియో కట్ చేసి వదిలారు. వెంకీ మామ ఎప్పుడూ అంటూ అభిమానులు అడుగుతుంటే… రానా పరుగు పరుగున దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లినట్టు? సోషల్ మీడియాలో దొబ్బేస్తున్నారు, కనీసం నా చెవిలో అయినా చెప్పు అంటూ అడిగినట్టు, బాబీ రానా చెవిలో రిలీజ్ డేట్ ఊదినట్టు… దాన్ని రానా వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టు – ఓ వీడియో కట్ చేసి వదిలారు. సోషల్ మీడియాలో తమ సినిమా రిలీజ్ డేట్‌పై వచ్చిన సెటైర్లు కూడా స్లైడ్స్ లో చూపించారు. మొత్తానికి వెంకీ మామ ఐడియా మాత్రం బాగుంది. కానీ రిలీజ్‌కి ఎంతో సమయం లేదు. వెంకీ మామ ట్రైలరు రావాల్సివుంది. పాటలూ బాకీనే. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ప్రమోషన్ హడావుడీ చాలా ఉంది. అవెప్పుడు పూర్తవుతాయో. 13 అనేది మంచి రిలీజ్ డేటే. కాకపోతే 20న ఏకంగా మూడు సినిమాలున్నాయి. అయినా సరే, వెంకీ మామ రంగంలోకి దూకేస్తున్నాడు.