నిర్భయ, దిశ వంటి ఆడపిల్లలు బలైపోయినప్పుడు… నిందితుల్ని తక్షణం శిక్షించాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. యావత్ దేశం ఇదే కొరుతోంది. రేపిస్ట్‌లను చంపేయాలంటున్నారు. సామాన్య జనం మాత్రమే కాదు.. ఇప్పుడు ఎంపీలు అదే మాట చెబుతున్నారు. సింగపూర్ తరహా శిక్షలు మన దగ్గర ఎందుకు ఉండవని ప్రశ్నిస్తున్నారు. మెజార్టీ ఎంపీలు కఠిన చట్టం తీసుకురావాలని పార్లమెంట్లో సూచించారు. కేంద్రం ఎలాంటి చట్టం తీసుకొచ్చినా.. తాము మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
మహిళలపై అత్యాచారం, హత్య ఘటనలపై గతంలో యూపీఏ సర్కార్ నిర్భయ చట్టం తీసుకొచ్చింది. తర్వాత బీజేపీ కూడా పోక్సో చట్టం తీసుకొచ్చింది. గతంలో ఉన్న లొసుగులను సవరించి.. చట్టానికి మరింత పదును పెట్టింది. అత్యాచార దోషులకు ఉరి శిక్ష వేయాలని చట్టం చెబుతోంది. కానీ.. ఆలస్యం జరుగుతోంది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ దారుణంలో దోషులకు ఇప్పటికీ ఉరి శిక్ష పడలేదు. దీనిపై కోర్టుల్లో వాదనలు సాగుతున్నాయి. కింది స్థాయి కోర్టు ఉరే సరి అని చెప్పినప్పటికీ.. ఆ తీర్పులు పై కోర్టుల్లో నిలవడం లేదు. వరంగల్ చిన్నారి ఘటనలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దోషికి ఉరి శిక్ష వేస్తే దానిని హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఈ వరుస ఘటనలు….. పార్లమెంట్లో ఎంపీలు.. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని..మోజీ సర్కార్.. సంచలన చట్టాన్ని తీసుకు రాబోతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. నేరస్థుల్లో భయాన్ని కల్పించలేకపోతున్నాయి. పార్లమెంట్, జనం, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి ఇప్పుడు రేపిస్టుల్ని ఉన్నపళంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తుంది. దీంతో మోడీ సర్కార్.. ప్రజలందర్నీ సంతృప్తి పరిచేలా.. ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోందని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగా ముందడుగు వేస్తేనే.. దిశకు న్యాయం చేసినట్లవుతుంది.