అమ్మాయిల కిడ్నాప్ కేసులో… పోలీసులకు దొరక్కుండా పారిపోయిన నిత్యానంద స్వామి.. సొంతంగా.. ఓ దేశాన్ని సృష్టించుకున్నారు. ఏదో ఓ దేశానికి పారిపోతే.. తనకూ.. విజయ్ మాల్యాకు.. నిరవ్ మోడీ లాంటి వాళ్లకు….తేడా ఏముంటుందని.. కొత్తగా ఆలోచించారు. అందుకే.. సొంతంగా.. కైలాస పేరుతో.. ఓ దేశాన్ని సృష్టించారు. ఈ దేశానికి సంబంధించి ఓ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్లు యాక్టివేట్ చేశారు. అన్నింటికీ మించి.. తన కైలాస దేశం నుంచి.. యూట్యూబ్లో… సందేశాలు అప్ లోడ్ చేస్తున్నారు. తాను కొత్తగా కనుగొన్న దేశం గురించి.. ఆ దేశం గొప్ప తనం గురించి గొప్పగా వివరిస్తున్నారు. అందర్నీ కైలాస దేశానికి ఆహ్వానిస్తున్నారు.
గుజరాత్ ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసినట్లుగా కేసులు నమోదు కావడంతో.. నిత్యానంద అదృశ్యమయ్యారు. ఆయన దేశం దాటిపోయారని.. తర్వాత పోలీసులకు తెలిసింది. ఎక్కడికి పోయారో ఎవరికీ తెలియలేదు. ఆయన సెంట్రల్ లాటిన్ అమెరికాకు వెళ్లారని.. అక్కడ ఈక్వెడార్ దేశంలో ఓ దీవిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దీవికే కైలాస అని పేరు పెట్టారని అంటున్నారు. ఈ కైలాస.. భూ మండలంపై అతి గొప్ప హిందూ దేశమని తన యూట్యూబ్ వీడియోల్లో.. నిత్యానంద ప్రమోట్ చేసుకుంటున్నారు.
తమ సొంత దేశాల్లో హిందూ మతాన్ని అధికారికంగా ఆచరించే హక్కును కోల్పోయిన, ప్రపంచవ్యాప్తంగా వంచితులైన హిందువులు సృష్టించుకున్న సరిహద్దులు లేని దేశం కైలాస అని అని నిత్యానంద చెప్పుకుంటున్నారు. ఈ దేశానికి సొంత పాస్పోర్టు ఉందని పేర్కొంది. దీని నమూనాను నిత్యానంద ఆన్లైన్లో విడుదల చేశారు. ఇంత చేసినా… తన దేశం ప్రపంచపటంలో ఎక్కడ ఉందో మాత్రం.. వెల్లడించడం లేదు. బహుశా.. అక్కడకు వెళ్లి పోలీసులు పట్టుకొచ్చేస్తారని భయపడుతున్నారేమో కానీ… సీక్రెట్ గా ఉంచుతున్నారు. వెబ్ సైట్లో పేర్లు నమోదు చేసుకున్న వారికే.. బహుశా.. కైలాసానికి.. నిత్యానంత తీసుకెళ్తారు కావొచ్చని అంటున్నారు. ఎంతైనా నిత్యానంద మామూలు స్వామి కాదని.. నిరూపించేసుకున్నారు.