టాలీవుడ్ అంటేనే మేడిపండు. పైకి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోపలన్నీ… పురుగులే. సినిమా ఆకర్షణలో పడి ఎంతోమంది ఫిల్మ్నగర్లోకి అడుగుపెడుతున్నారు. అదే అదునుగా కొంతమంది వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. సినిమా పేరు చెప్పి బ్రోకర్లు డబ్బులు దండుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ అవకాశాలు ఇస్తానని చెప్పి ఓ నటి మాయమాటలు చెబుతోంది. అమ్మాయిల్ని వ్యభిచార రొంపిలోకి దింపుతోంది. తెరచాటున జరుగుతున్న ఈ నాటకానికి ఓ సీనియర్ నటీమణి ప్రధాన సూత్రధారి అవుతోందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తను ఓ నటి. చాలా సినిమాల్లో చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసింది. ఇప్పుడు అవకాశాల్లేవు. అయితే.. తను ఖాళీగా లేదు. `మీకు అవకాశాలు ఇప్పిస్తా` అంటూ తన సొంత ఊరు నుంచి, ఆ చుట్టు పక్కల ఉన్న ఊర్ల నుంచి కొంతమంది అమ్మాయిల్ని హైదరాబాద్ రప్పించుకుంటోంది. లేదంటే `అవకాశాలేమైనా ఇప్పిస్తారా` అంటూ ఆమెను ఆశ్రయించిన కొంతమందిని పావులుగా వాడుకొంటోంది. తన దగ్గర కనీసం ఆరు నుంచి పది మంది అమ్మాయిలు ఉన్నారు. అంతా ఇరవై ఏళ్లలోపువాళ్లే. `నాకు చాలామంది దర్శకులు నిర్మాతలు తెలుసు. మీకు అవకాశాలు ఇప్పిస్తా` అంటూ వాళ్లని మాయలో పడేసింది. మెల్లిగా వ్యభిచార కూపంలోకి లాగింది. హైటెక్ పద్ధతిలో.. ఈ దందా మొదలెట్టింది.
సినిమాల్లో నటించాలంటే ఇవన్నీ తప్పవేమో అనుకున్నకొంతమంది ఇష్టంలేకపోయినా ఆ సీరియర్ నటీమణి చెప్పినట్టు నడుచుకోవాల్సివస్తోంది. ఈ విషయం ఇటీవల ఓ అమ్మాయి తండ్రికి తెలిసింది. తన కూతురు మాయ మాటల్ని నమ్మిందని గ్రహించాడు. వెంటనే తన మందీ మార్బలంతో హైదరాబాద్ వచ్చి, ఆ సీనియర్ నటీమణి ఇంటికెళ్లి గొడవ చేసి మరీ వెళ్లాడు. ఇంకోసారి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే… మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లాడట. ఇదంతా… ఫిల్మ్నగర్లో వినిపిస్తున్న వార్తే. ఆ సీరియర్ నటీమణి ఎవరన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్.
అయితే ఈ దందా ఇప్పుడే మొదలైంది కాదని, ఐదేళ్ల నుంచీ ఇలానే జరుగుతోందని, ఆ నటి వల్ల ఎవరికీ అవకాశాలు రాలేదని, కానీ ఒక్కసారి రొంపిలోకి దిగిన తరవాత అందులోంచి ఎవ్వరూ బయటపడడం లేదని, ఇదంతా ఆ నటి క్యాష్ చేసుకుంటోందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంగతి బయటకు వచ్చింది. రాని విషయాలు, ప్రమాదాలూ ఇంకా పరిశ్రమలో ఎన్ని జరుగుతున్నాయో..?