కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం దంపతులు మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో నాల్గవ రోజుకి చేరుకొంది. ఆయన వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడానికి నిరాకరిస్తూ తన ఇంటి తలుపులు మూసుకొని తమ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన అనుచరులు ఎవరినీ లోపలకి రానీయకుండా అడ్డుకొంటున్నారు. దానివలన ముద్రగడ దంపతుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనే అవకాశం లేకుండా పోయింది. దీక్ష మొదలుపెట్టిన రెండవ రోజుకే వారి షుగర్ లెవెల్స్ తగ్గడం మొదలయింది కనుక ఇప్పటికి ఇంకా తగ్గి ఉండవచ్చును. దాని వలన వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షలకి సహకరించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరిండెంట్ చేసిన విజ్ఞప్తులను ఆయన త్రోసిపుచ్చి నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇంకా ఆలస్యం అయితే వారి పరిస్థితి విషమించే అవకాశం ఉంది కనుక నేడోరేపో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయవచ్చును.