కాంగ్రెస్ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆయన మొత్తంగా 105రోజుల పాటు జైల్లో ఉన్నారు. ప్రాధమిక సాక్ష్యాధారాలు కూడా లేకుండా.. తనను ఇన్ని రోజులు జైల్లో పెట్టడం ఏమిటని.. చిదంబరం న్యాయస్థానంలో వాదించారు. తానేమైనా.. బిల్లా, రంగానా అంటూ… ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం లాంటి ఆర్థిక నేరస్తుడికి బెయిల్ ఇస్తే.. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని.. ఈడీ తరపు న్యాయవాదులు.. వాదించారు. అయినప్పటికీ..షరతులతో కూడిన బెయిల్‌ను చిదంబరానికి ధర్మాసనం మంజూరు చేసింది.
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్ఎక్స్ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడానికి.. పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారనేది ఆయనపై ఉన్న కేసు . ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద.. ఆయన కుమారుడి కంపెనీలకు వందల కోట్లు బదిలీ చేశారని… ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. దీనిపై చిదంబరం కుమారుడ్ని కూడా గతంలో అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తర్వాత చిదంబరాన్ని అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాకు.. గతంలో.. ఇంద్రాణి ముఖర్జీయా అధిపతిగా ఉండేవారు. ఆమె.. కుమార్తెని హత్య చేయించిన కేసులో.. ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. ఆమె లంచం ఇచ్చినట్లుగా.. కార్తీ తీసుకున్నట్లుగా.. అప్రూవర్‌గా మారినట్లు.. సీబీఐ, ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసులో మూడున్నర నెలల కిందట.. హైడ్రామా మధ్య చిదంబరాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పలుమార్లు..బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోగా.. వాదనలు విన్న ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ప్రకటించింది. జైల్లో.. చిదంబరాన్ని రాహుల్, సోనియా, ప్రియాంక పరామర్శించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. చిదంబరానికి బెయిల్ లభించడం.. కాంగ్రెస్ పార్టీకి ఊరట లాంటిదే. !