‘వెంకీ మామ’ రిలీజ్డేట్లపై బోలెడన్ని సెటైర్లు పడ్డాయి. అసలు రిలీజ్ చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అంటూ… వెంకటేష్, నాగచైతన్య ఫ్యాన్స్ చిత్రబృందంపై మండిపడ్డారు. దాన్ని థీమ్‌గా చేసుకుని రానాపై ఓ వీడియో షూట్ చేసి, సరదాగా విడుదల చేశారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ బయటకు వచ్చేసింది. డిసెంబరు 13నే ఈ సినిమావస్తోంది.
అయితే ఈ రిలీజ్ డేట్ గురించి వెంకీ కూడా కామెడీ చేశాడు. వెంకీమామకు సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. వెంకీ మైకు పట్టుకోగానే.. తనదైన శైలిలో”థ్యాంకూ దేవుడా… ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం చాలా రోజుల నుంచీ ఎదురుచూస్తున్నాను. థ్యాంక్యూ సురేష్ ప్రొడక్షన్.. థ్యాంక్యూ అన్నయ్య..” అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టు యాక్ట్ చేసి, మరీ నవ్వించాడు వెంకీ. రానాతోనూ, చైతూతోనే కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఇప్పటికి చైతూతో నటించగలిగానని, ఈ సినిమా కోసం తన కుటుంబ సభ్యులెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు వెంకీ.
రిలీజ్ డేట్ పట్ల చైతూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ”సురేష్ మావయ్య చాలా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటారు. సోలో రిలీజ్ పడడం అదృష్టం. ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతోంది. ప్రేమమ్‌లో వెంకీ మామతో కలిసి ఓ సన్నివేశంలో నటించాను. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో, ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉంద”న్నాడు. తనకు మనం ఓ స్పెషల్ మూవీ అని, ఆ తరవాత వెంకీ మామకు చోటిస్తానని అంటున్నాడు చైతూ.