ఏ పార్టీలోనైనా సరే నాయకులు తమకు తగిన గుర్తింపు కోసం ఎదురుచూస్తుంటారు. కొందరు నాయకులు కష్టపడి పనిచేసినా గుర్తింపు రాదు. అధిష్టానం వీరిని పట్టించుకోదు. సీనియారిటీని లెక్కలోకి తీసుకోదు. వీళ్ల ముందే కొందరు నాయకులు ఎదిగిపోతుంటారు. పదవులు సంపాదించుకుంటారు. అధిష్టానం నాయకులకు గుర్తింపు ఇవ్వడమంటే ‘తగిన పదవి’ ఇవ్వడమని అర్థం. ప్రస్తుతం తమకు తగిన పదవి రావడంలేదని తెలంగాణ బీజేపీలోని ఇద్దరు సీనియర్ నాయకులు బాధపడిపోతున్నారు.
ఈ ఇద్దరు నాయకులు ఇంద్రసేనారెడ్డి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. వీరిద్దరూ గవర్నరు పోస్టులు కోరుకుంటున్నారు. ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపి గుర్తింపు ఇస్తే బాగుండునని అనుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు త్వరలోనే జరగనుంది. దానికోసం కొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. పరిశీలనలో ఉన్నవారు పనికిరారనుకుంటే మళ్లీ రెండోసారి కూడా లక్ష్మణ్‌నే నియమించవచ్చు. అయితే రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం లక్ష్మణ్ ఇష్టం లేదని సమాచారం.
ఆయన గవర్నరు పోస్టునే కోరుకుంటున్నారు. తన హయాంలో తెలంగాణలో బీజేపీ బలపడిందని ఆయన చెబుతున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ ఇన్ని స్థానాలు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా నిజామాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెను కవితను ఓడించడం బీజేపీ సాధించిన పెద్ద విజయం. ఇది కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసినట్లుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆర్‌టీసీ కార్మికుల సమ్మె సమయంలోనూ లక్ష్మణ్ సహా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ వెళ్లి మంత్రులతో మాట్లాడారు.
దీంతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జోక్యం చేసుకొని ఆర్‌టీసీలో కేంద్రానికి వాటా ఉందని, టీఎస్‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, అదింకా ఏపీఎస్‌ఆర్టీసీలో భాగంగానే ఉందని ప్రకటనలు చేశారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాలు ఇవ్వడం కూడా కేంద్రం భయం వల్లనేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు. సహజంగానే ఈ క్రెడిట్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కే దక్కుతుంది. పార్టీ కోసం ఇంతగనం కష్టపడిన తనకు కేంద్రం తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక సీనియర్ నాయకుడైన ఇంద్రాసేనా రెడ్డికి ఇప్పటివరకు పార్టీలో గుర్తింపు రాలేదు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఉమ్మడి ఏపీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి ఢిల్లీలో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశాడు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా పంపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. తెలంగాణకు గవర్నరుగా వచ్చిన తమిళిసై కూడా బీజేపీ నాయకురాలే. ఆమె తమిళనాడు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా గవర్నరు పదవి ఇచ్చారు. వీరందరికీ గుర్తింపు ఇచ్చినప్పుడు తమకూ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట…! మరి వీరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో…!