తెలంగాణలో ఈమధ్య జరిగిన అతి పెద్ద సమ్మె ఆర్టీసీ కార్మికులది. ఇది అతి పెద్ద, అతి సుదీర్ఘ సమ్మె కూడా. చివరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదు పొమ్మన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాని కార్మికులకు రిటైర్మెంటు వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదన్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేస్తున్నామని, ఇక యూనియన్లు ఉండవని ప్రకటించేసి అందుకు అనుగుణమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో బలవంతంగా యూనియన్లు క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఏపీలో ఆర్టీసీ యూనియన్లు స్వచ్ఛందంగా రద్దు కాబోతున్నాయి.
ఇక్కడ స్వచ్ఛందంగా అంటే ఆటోమేటిగ్గా, సహజంగా రద్దు కాబోతున్నాయని అర్థం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో బహుశా జనవరిలోనే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమైపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా కార్మికుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచుతామని సీఎం జగన్ ఇది వరకే చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులైపోతారు కాబట్టి ఆటోమేటిగ్గా కార్మిక సంఘాలు తెరమరుగైపోతాయి. అప్పుడు వారు ఆర్టీసీ ఉద్యోగులవుతారు కాబట్టి ఉద్యోగ సంఘాలు పెట్టుకోవచ్చు.
కాని ఆర్టీసీ కార్మికుల మాదిరిగా సమ్మెలు చేసే అవకాశం ఉండదు. అలాగే సౌకర్యాల విషయంలో ఆర్టీసీ కార్మికులకు ఉన్న కొన్ని సౌకర్యాలు ఉండవు. వారికి లేని కొన్ని సౌకర్యాలు ఉద్యోగులుగా మారాక సమకూరతాయి. ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ప్రభుత్వంలో విలీనమయ్యాక పూర్తి ఉద్యోగ భద్రత సమకూరుతుంది. ఆర్టీసీని విలీనం చేస్తామని జగన్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. దాని ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల సమయంలో విలీనం చేస్తామనే హామీ ఇచ్చినా ఇప్పుడు తిరస్కరించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె మధ్యలోనే ఆ డిమాండ్‌ను వదులుకున్నప్పటికీ కేసీఆర్ వారిని దయచూడలేదు. ఏపీలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన చేయలేడనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేశారు.
విలీనం చేస్తే ప్రభుత్వానికి పెనుభారం అవుతుందని, అది గుదిబండలా తయారవుతుందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. అయినప్పటికీ విలీనం చేసేందుకు జగన్ చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ వైఖరి చూశాక, విలీనం చేయలేమని కేసీఆర్ తెగేసి చెప్పాక జగన్ కూడా విలీనాన్ని పక్కన పెట్టే అవకాశముందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు విలీనం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక ఆర్టీసీ చార్జీలను కేసీఆర్ పెంచడం ఇప్పుడు మరో వివాదమైంది. చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఎన్ని విమర్శలు చేసినా చార్జీలు తగ్గవనుకోండి. ఇదే సమయంలో ఏపీలో ఎలాంటి చార్జీలు పెంచలేదు. దీంతో కేసీఆర్ కంటే జగన్ బెటరని అంటున్నారు.
అయితే ఏపీలో ఆర్టీసీ విలీనం తరువాతగాని అసలు విషయాలు తెలియవు. అంటే విలీనం ప్రభుత్వానికి భారమవుతుందా? అంతా సజావుగా సాగుతుందా? అనేది విలీనం కాగానే తెలియదు. కొంతకలం గడిస్తేగాని కేసీఆర్ అభిప్రాయపడినట్లు భారమవుతుందా? కాదా? అనేది తెలుస్తుంది. ఏపీలో ఆర్టీసీని విలీనం చేస్తున్నారని వార్తలు వచ్చిన తరువాతే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు దాన్ని ప్రధాన డిమాండుగా పెట్టుకొని సమ్మెకు దిగారు. కాని చివరకు దాన్ని వదులుకోక తప్పలేదు. ఒకవేళ ఏపీలో విలీనం విజయవంతమైతే తెలంగాణలో మళ్లీ ఈ డిమాండ్ ముందుకు వస్తుందేమో…!