గద్దర్ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. చాలాకాలం తరువాత ఆయన పేరు మీడియాలో కనిపించింది. గద్దర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పాటలు, పోరాటాలు. ఆయనది ప్రశ్నించే గొంతు. పాలకులను నిలదీస్తే మనస్తత్వం. కాని చిత్రంగా ఆయన దీనస్థితిలో ఉన్నట్లు మీడియాలో వార్త వచ్చింది. 73 ఏళ్ల గద్దర్, ‘ప్రజాయుద్ధ నౌకగా’ ప్రాచుర్యం పొందిన ఈ ప్రజాగాయకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గద్దర్ ఈ వయసులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమేంటీ అని ఆశ్చర్యపడుతుండగానే ‘అవును…సాంస్కృతిక సారథిలో కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న మాట నిజమే’ అని చెప్పాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ‘సాంస్కృతిక సారథి’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
దీని అధిపతి కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. గద్దర్ తన లెటర్‌హెడ్ మీద తనకు ఉద్యోగం కావలంటూ రాసి దాన్ని తన అనుచరుడికి ఇచ్చి కార్యాలయంలోకి పంపాడు. తాను దరఖాస్తు చేసుకున్నది తాత్కాలిక ఉద్యోగానికని చెప్పాడు. బతుకుతెరువు కోసం ఉద్యోగానికి అప్లయ్ చేశానన్నాడు. తాను ఇంజినీరింగ్ చేశానని, పాటలు పాడతానని, ఆడతానని కాని తన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు లేవని దరఖాస్తులో పేర్కొన్నాడు. తాను కళాకారుని ఉద్యోగాన్ని కోరుకున్నానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇతర కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు తిరుగుతానని, ఆడలేకపోయినా, పాడలేకపోయినా కనీసం వారి డప్పులైనా మోస్తానని అన్నాడు.
గద్దర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన విషయాన్ని సాంస్కృతిక సారథి కార్యాలయం కూడా ధ్రువీకరించింది. అసలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలనే ఆలోచన గద్దర్‌కు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదు. ‘నేను కూడా బతకాలి కదా’ అన్నాడు గద్దర్. అంటే ఆయన పూట గడవని స్థితిలో ఉన్నాడని అనుకోవాలా? ఈయన నేపథ్యం ఏమిటో చాలామందికి తెలుసు. ఒకప్పుడు ఆయన ‘అన్న’లకు దోస్తు. మావోయిస్టుల భావజాలం నరనరాల్లో నింపుకున్న వ్యక్తి. వారి సానుభూతిపరుడు. గద్దర్ కాలికి గజ్జె కట్టుకొని వేదిక మీదికి వస్తే జనం ఊగిపోయేవారు. ఆయనో వాగ్గేయకారుడు. ఆయనకు సూపర్‌స్టార్ ఇమేజ్ ఉండేది. ఆయనది ధిక్కార స్వరం. ఎక్కడ పోరాటం ఉంటే అక్కడ ఉండేవాడు.
అనేక ప్రజాపోరాటాల్లో పాలుపంచుకున్న కళాకారుడు. అలాంటి గద్దర్ క్రమంగా మావోయిస్టులకు దూరమయ్యాడు. వారి భావజాలాన్ని వదిలించుకున్నాడు. బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదన్నాడు. గతంలో సొంతంగా పార్టీ పెడతానన్నాడు. ఊరూరు తిరిగి ప్రజాస్వామ్యం గొప్పదనం గురించి ప్రచారం చేస్తానన్నాడు. ఒకసారి గద్దర్‌ను కేసీఆర్ మీద పోటీ పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేశాయి. ఈ వాగ్గేయకారుడు క్రమంగా ప్రజల నుంచి, పోరాటాల నుంచి దూరమైపోయాడు. కొంతకాలంగా ఆయన పేరే ఎక్కడా వినిపించలేదు. ఇప్పుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటూ కనిపించాడు. ఎందుకిలా జరిగింది?