కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వం తరపున దూతలుగా వచ్చిన తెదేపా నేతలు బొడ్డు బాస్కర రామారావు, తోట త్రిమూర్తులు నిన్న అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు సఫలమయినట్లు సమాచారం. కనుక మరికొద్ది సేపటిలో మంత్రి అచ్చెం నాయుడు, తెదేపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు, తోట త్రిమూర్తులు ఆయనతో చర్చించి, దీక్ష విరమింపజేయడానికి కిర్లంపూడి రాబోతున్నారు. ఒకవేళ వారి చర్చలు సఫలం కానట్లయితే పోలీసులు ముద్రగడ దంపతుల దీక్షను భగ్నం చేయవచ్చును. కానీ నిన్న రాత్రి జరిగిన చర్చలలో ఆయన పెట్టిన షరతులలో చాలా వాటికి తెదేపా నేతలు సానుకూలంగా స్పందించారు కనుకనే నేడు అచ్చెం నాయుడు తదితరులు ఆయనని కలవడానికి వస్తున్నారు. కనుక వారు ఆయన చేత దీక్ష విరమింపజేయవచ్చును.
తెదేపా నేతలతో నిన్న రాత్రి జరిపిన చర్చలలో ముద్రగడ పద్మనాభం పెట్టిన షరతులు:
- కాపులకు రిజర్వేషన్ల కోసం వేసిన జస్టిస్ మంజూనాద్ కమీషన్ తన నివేదికను మూడు నెలలోగా ప్రభుత్వానికి అందజేయాలి. నలుగురు సభ్యులు ఉండే ఆ కమీషన్ లో తాను సూచించిన ఒక వ్యక్తిని సభ్యుడిగా నియమించాలి.
- ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున కాపుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలి.
- తునిలో విద్వంసానికి పాల్పడిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేసి మిగిలిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
ఈ మూడు షరతులలో మంజూనాద్ కమీషన్ నివేదికను మూడు నెలల గడువులో కాకపోయినా వీలయినంత త్వరగా సమర్పించాలని కోరుతామని తెదేపా నేతలు హామీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం సూచించిన వ్యక్తిని కమీషన్ లో సభ్యుడుగా నియమించేందుకు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో కాపు సంక్షేమ కార్పోరేషన్ కి ఒకేసారి వెయ్యి కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు కనుక కొంత మొత్తం చెల్లించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తెలియజేస్తామని వారు హామీ ఇచ్చారు. అది కూడా ఒకేసారి కాకుండా వాయిదా పద్దతిలో చెల్లించగలమని చెప్పినట్లు సమాచారం. ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై నేడు తెదేపా నేతల చర్చలతో తేలవచ్చును. ముద్రగడ పెట్టిన మూడవ షరతుకి తెదేపా నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపటిలో అచ్చెం నాయుడు తదితరులు ఆయన నివాసానికి చేరుకొని చర్చలు జరుపుతారు. వారి చర్చలు ఫలించినట్లయితే వారు ఆయన చేత దీక్ష విరమింపజేస్తారు లేకుంటే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేయవచ్చును.