దక్షిణాదిలో భాజపా ట్రంప్ కార్డు హిందుత్వ ఇంతవరకూ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం భాజపా ఫోకస్ తెలంగాణ మీద ఉంది. ఇక్కడ ఎలాగోలా పట్టు సాధించడం కోసం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు హిందుత్వ కార్డును కూడా ఇక్కడ ప్రయోగించే ప్రయత్నంలో ఉందా… అంటే, ఉంది. కానీ సరైన సందర్భం దొరకడం లేదే! అలాంటి సందర్భాన్వేషణలో పడ్డట్టున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్. విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ హైందవ ధర్మానికి ఒక ముప్పుగా మారాడు అంటూ తీవ్ర విమర్శ చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారు అన్నారు. ఈ వ్యాఖ్యలకు నేపథ్యం ఏంటంటే… యాదాద్రి ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులు!
ఆలయ స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన శిల్పాలనే చెక్కించుకున్నారనీ, భాజపా ఉద్యమించేసరికి వెనక్కి తగ్గారన్నారు లక్ష్మణ్. ఇప్పుడు, ఏకంగా స్వయంభువు లక్ష్మీ నర్సింహ స్వామి విగ్రహాన్నే ఉలితో చెక్కేసిన పరిస్థితి వచ్చిందంటే… మహాదారుణమనీ, మహాపాపమని విమర్శించారు. ఆలయ పునరుద్ధరణలో భాగంగా గర్భగుడిని, మూలవిరాట్ ను, ఆంజనేయ స్వామి ఆలయాన్ని ముట్టుకోమని గతంలో సీఎం చెప్పారన్నారు. కానీ, ఇవాళ్ల ఆగమ శాస్త్ర నియమాలకు భిన్నంగా మహాపచారం జరుగుతోందన్నారు. ఇంతకీ యాదాద్రిని ముఖ్యమంత్రి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు? ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారా, పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారా, ఈ రెండు అంశాలు అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సాహిస్తున్నారా అన్నారు. యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రణాళిక ప్రభుత్వం దగ్గరలేదన్నారు. అందుకే అక్కడ వరుసగా మహాపచారాలు జరుగుతున్నాయన్నారు.
అసలే భాజపా, ఆపై గుడిలో అపచారాలు, హైందవ సంప్రదాయాలు అనే టాపిక్ దొరికింది! దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించే ప్రయత్నం గట్టిగా చేసేందుకు లక్ష్మణ్ సిద్ధమౌతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ పేరుతో ముఖ్యమంత్రిని ఏకంగా హిందూద్వేషి అనేశారు. ఒక గుడి నిర్మాణ పనుల్లో జరిగే కొన్ని హెచ్చుతగ్గులు, లేదా కొన్ని సమస్యల్ని తీసుకుని… దాన్ని ఏకంగా హిందుత్వానికి ముడిపెట్టేసి ముప్పుగా విమర్శించడం ఎంతవరకూ సమంజసం? ఆలయ పునర్మిర్మాణంలో తప్పులుంటే ఎత్తి చూపొచ్చు, లోపాలుంటే సలహాలూ సూచనలు చెయ్యొచ్చు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనుభవం లేకపోతే… ఒక ప్రణాళిక తయారు చేసి భాజపా ఇవ్వొచ్చు. ఆ తరువాత, ఆలయ పునర్నిర్మాణంలో మేమూ సాయపడ్డామని ప్రచారం చేసుకోవచ్చు కదా!