మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మరోసారి ప్రకటించారు. ఈ ఆరు నెలల కాలంలో.. ఆయన పక్క పార్టీల వైపు చూడటం.. అలాంటి వార్తలు.. పెద్ద ఎత్తున వచ్చే సరికి.. టీడీపీలోనే ఉంటానని ప్రకటించడం.. మూడు, నాలుగు సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రకటన చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. టీడీపీ కార్యక్రమాల్లో గంటా శ్రీనివాసరావు పాల్గొనడం లేదు. రూమర్స్కి చెక్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం..ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొన్నాళ్ల క్రితం.. విశాఖ జిల్లా సమీక్షా సమావేశానికి చంద్రబాబు వచ్చినప్పుడు.. ఆయన వచ్చారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్లోకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లి సీఎం రమేష్ సాయంతో.. మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్లు తీసుకుని ఫోటోలు దిగి వచ్చారు. ఈ లోపు.. ఆయన వ్యాపారాల్లో బ్యాంకుల్ని మోసం చేసినట్లు ఆరోపణలు రావడం.. ఆయన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకులు నోటీసులు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ క్రమంలో.. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం ఊపందుకుంది. పలువురు బీజేపీ నేతలు కూడా.. గంటా శ్రీనివాసరావు తమతో టచ్లో ఉన్నారని చెప్పుకున్నారు. సోము వీర్రాజు లాంటి నేతలైతే.. ఆయన ఇంటికి వెళ్లి.. సమావేశం అయి బయటకు వచ్చి.. టీడీపీ పనైపోయిందని.. అందరూ బీజేపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ గంటా మాత్రం.. ఎలాంటి ఖండనలు విడుదల చేయలేదు.
అయితే.. హఠాత్తుగా గంటా శ్రీనివాసరావు ఇప్పటికిప్పుడు.. టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం.. చంద్రబాబు.. గంటా శ్రీనివాసరావుకు ఫోన్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. గంటాకు ఉన్న ఇబ్బందుల విషయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చి… మున్సిపల్ ఎన్నికల కోసం ఉత్తర నియోజకవర్గంలో… పార్టీని సిద్దం చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. దానికి గంటా అంగీకరించారని.. త్వరలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించి కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే.. గంటా మనసు మారినట్లేనంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందో మాత్రం అంచనా వేయలేమని.. టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.