మంచి బుద్ధి పుట్టినవాళ్లు ఎవరు? వీళ్లు ఏం మంచి పని చేశారు? మంచి బుద్ధి పుట్టినవాళ్లు ఎవరో కాదండి. మన పార్లమెంటు సభ్యులు. మన పార్లమెంటు సభ్యులంటే తెలుగోళ్లు అని అర్థం కాదులెండి. భారత ఎంపీలని అర్థం. ఇంతకూ వీరు ఏం మంచి పని చేశారని మీకు డౌటుగా ఉంది కదా. వీరు చేసింది గొప్ప త్యాగం కాదు. కాని వారి దృష్టిలో అది పెద్ద త్యాగమేనని చెప్పుకోవాలి. మన ప్రజాప్రతినిధులకు అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చాలా సౌకర్యాలుంటాయి. కొన్ని సౌకర్యాలు పూర్తి ఉచితంగా ఉంటాయి. కొన్ని సౌకర్యాలు రాయితీలతో ఉంటాయి. పోనీ వీరేమైనా బీదవాళ్లా? కాదు. తిండికి గతిలేని వాళ్లా? కాదు. ఎవరో కొద్దిమంది మినహాయిస్తే ఒక్కొక్కళ్ల దగ్గర కట్టుకుపోయేంత ఉంది. అయినప్పటికీ మన రాజ్యాంగం, మన ప్రభుత్వాలు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అనేక సౌకర్యాలు కల్పించి వారిని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాయి.
సరే…ఇంతకూ వీరు చేసిన మంచి పని గురించి చెప్పుకోలేదు కదా. పార్లమెంటు క్యాంటీన్లో ఎంపీలకు టిఫిన్లు, టీ, కాఫీ, ఇతర పానీయాలు, భోజనం (మాంసాహారం, శాకాహారం) చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. అంటే ‘సబ్సిడైజ్డ్ ఫుడ్’ అన్నమాట. పాపం…ఈ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి వాటి కోసం పోరాటం చేస్తారు కదా. గొంతులు పోయేదాకా నినాదాలు చేస్తారు. అధికారపక్షం మీద ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షం మీద అధికారపక్ష సభ్యులు విమర్శలు చేస్తారు. వాకౌట్లు చేస్తారు. వెల్లోకి వెళ్లి స్పీకరు (రాజ్యసభ అయితే ఛైర్మన్) చెవులు చిల్లులు పడేలా కేకలు వేస్తారు. మరి ఈ పనులన్నీ చేయాలంటే బాగా శక్తి కావాలి. శక్తి కావాలంటే బాగా తినాలి. మరి పార్లమెంటు క్యాంటీన్లో ఎక్కువ ధరలుంటే అంత డబ్బు ఖర్చు చేయడం కష్టం కదా. ఉన్నదంతా ఇక్కడే ఖర్చు చేస్తే ప్రజాసేవకు డబ్బుండదు.
అందుకే ప్రభుత్వం క్యాంటీన్లో చాలా తక్కువ ధరలకు పదార్థాలు దొరికే సౌకర్యం కల్పించింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా రాయితీపై ఆహార పధార్థాలకు కొదవ ఉండదు. బయట హోటళ్లలో కంటే పార్లమెంటు క్యాంటీన్లో ధరలు చాలా…చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని ధరలు చూద్దాం…చికెన్ కర్రీ రూ.50, తందూరి చికెన్ రూ.60,ప్లెయిన్ దోసె 12, ఫిష్ కర్రీ 40, మటన్ కర్రీ 40, కాఫీ 5, అన్నం 7 రూపాయలు. ఇలా ఇంకొన్ని చెప్పుకోవచ్చనుకోండి. వీటి అసలు రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎక్కువ రేటును ప్రభుత్వం భరిస్తోంది.
అయితే పార్లమెంటు సభ్యులు అనూహ్యంగా, ఏకగ్రీవంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆహార పదార్థాలపై సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇక నుంచి ఆహార పదార్థాలను వాటి అసలు రేట్లకే కొనుగోలు చేయాలని (అసలు రేటు చెల్లించాలని) డిసైడ్ చేసుకున్నారు. ఎంపీలు సంప్రదింపులు జరుపుకొని ఈ నిర్ణయం తీసుకున్నారట…! స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు వీరు ఈ పని చేశారు. లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులు సబ్సిడీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏడాదికి 17కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయి.
ఇప్పటివరకు ఆహార పదార్థాల అసలు ధరలో 80 శాతం మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈమధ్య జవహర్లాల్ యూనివర్సిటీలో హాస్టల్ ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు పార్లమెంటు క్యాంటీన్ రేట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యంత తక్కువ రేట్లకు పార్లమెంటు సభ్యులకు ఆహార పదార్థాలు ఇవ్వడమేంటని నెటిజన్లు ప్రశ్నించారు. కోటీశ్వరులకు ఈ రాయితీలు ఎందుకని నిలదీశారు. పోనీలే ఇప్పటికైనా ఓ మంచి పని చేశారు.